రేవంత్ కు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే ఛాన్స్ ఇచ్చిందెవరు కేటీఆర్?
తాము చేయని పనిని.. ఇంకెవరైనా చేస్తుంటే ఆక్రోశించే తీరు కొందరిలో కనిపిస్తూ ఉంటుంది.
తాము చేయని పనిని.. ఇంకెవరైనా చేస్తుంటే ఆక్రోశించే తీరు కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడుఆ కోవలోకే చెందుతారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన వైనంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడటమే కాదు.. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆ విగ్రహాన్ని తొలగిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే హక్కు తెలంగాణ ద్రోహి రేవంత్ కు లేదంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓట్లతోనే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి.. తెలంగాణ ద్రోహిని తెలంగాణ ఓటర్లు ఎన్నుకున్నారన్నది కేటీఆర్ మాటనా? ఇలాంటి వ్యాఖ్యలు సరైనదేనా? అన్నది ప్రశ్న. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రోజున రేవంత్ ఏర్పాటు చేసే అవకావాన్ని ఇచ్చిందెవరు? అన్నది ప్రశ్న. పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉంటే.. ఈ రోజున రేవంత్ కు ఆ ఛాన్స్ ఉండేది కాదు కదా?
తాము అధికారంలో ఉన్నప్పుడు చేయని పనుల్ని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారు చేపడితే.. ఏదో రకంగా తిట్టిపోయటం.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న తీరు చూస్తుంటే.. ఉడుకుమోతుతనంతో చేసే వ్యాఖ్యలుగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుందన్న కేటీఆర్ వ్యాఖ్యలు చూసినప్పుడు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని పట్టుకొని అన్నేసి మాటలు అనటంలో అర్థముందా? గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైనా తీవ్ర విమర్శ చేస్తే.. సీఎంకు ఇవ్వాల్సిన కనీస గౌరవ మర్యాదలు ఇవ్వరా? అంటూ ఆవేశ పడిపోయే కేటీఆర్.. విపక్షంలోకి రాగానే తాను చెప్పిన రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్ తీరును ఏమనాలి? ఎలా చూడాలన్నదే అసలు ప్రశ్న.