అదానీ ముచ్చట సరే.. ఆంధ్రోళ్లకు కాంట్రాక్టుల మాటేంది కేటీఆర్?

మాజీ మంత్రి కేటీఆర్ ఫస్ట్రేషన్ లో ఉన్నారా? తనకు తాను తెలివైనోడిగా కొందరు ఫీల్ అవుతుంటారు

Update: 2024-01-26 07:30 GMT

మాజీ మంత్రి కేటీఆర్ ఫస్ట్రేషన్ లో ఉన్నారా? తనకు తాను తెలివైనోడిగా కొందరు ఫీల్ అవుతుంటారు. అలాంటి వేళలోనే.. అందరూ సదరు వ్యక్తిని తెలివిలో తోపు అంటూ పొగడటం మొదలు పెట్టినంతనే సంతోషానికి గురి కావటం మామూలే. కొందరు మాత్రం ఆ సంతోషంలో తమ స్థాయిని తమకు తామే పెంచేసుకుంటారు. ఆకాశంలో విహరిస్తూ.. నేల మీద నడవటం మానేస్తారు. అలాంటి వారితో వచ్చే ఇబ్బంది ఏమంటే.. ఎంతో ఎత్తున ఉన్నప్పటికీ ఒద్దికగా నేల మీద నడిచే వారు.. ఆకాశంలో విహరించే వారికి కనిపించరు. దీంతో.. వాస్తవాన్ని వదిలేసి.. తమకున్న అవగాహనను బయటపెడుతూ అడ్డంగా బుక్ అవుతుంటారు. కేటీఆర్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది.

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ కు వెళ్లిన సీఎం రేవంత్ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫస్ట్రేషన్ ఒక ఎత్తు అయితే.. అదానీతో కుదుర్చుకున్న భారీ ఒప్పందం మీద పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు. విపక్షంలో ఉన్నప్పుడు అదానీని విమర్శించిన సీఎం రేవంత్.. ఇప్పుడెలా ఒప్పందం కుదుర్చుకున్నారన్న ప్రశ్నను సంధించారు కేటీఆర్. ఆయన ప్రశ్నల్ని చూసినప్పుడు.. తెలివితేటలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా పొగిడే కేటీఆర్.. సింఫుల్ లాజిక్ మర్చిపోవటం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది.

ఎందుకంటే.. విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ప్రముఖ వ్యాపార దిగ్గజం అదానీపై విమర్శలు చేసి ఉండొచ్చు. కానీ.. ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ అందుకు తగ్గట్లే అడుగులు వేస్తున్నారు. ఇక్కడ సమస్యంతా కూడా మాజీ మంత్రి కేటీఆర్ దే. అదానీ పెట్టుబడులపై వ్యూహాత్మక మౌనాన్ని పాటించటం మానేసి.. అదానీ ఉదంతాన్ని అవసరానికి మించి వ్యాఖ్యలు చేయటం వల్ల జరిగే నష్టాన్ని గుర్తించే విషయంలో గులాబీ యువరాజు మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు పెట్టటాన్ని ఒప్పుకోకుంటే జరిగే నష్టం ఎంతన్నది తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను అదానీ ప్రస్తావన తెచ్చినంతనే.. రాజకీయ ప్రత్యర్థులు తమ పాలనలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున ప్రాజెక్టులు ఇచ్చామన్న విషయాన్ని లేవనెత్తితే అందుకు సమాధానం ఇచ్చే వీలుండదన్న విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఎలా మిస్ అవుతున్నారన్నది ప్రశ్న. తమ ప్రభుత్వానికి ముందు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నేతలుగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన పెట్టుబడుదారుల మీద ఫైర్ అయిన తాము.. ప్రభుత్వాన్ని కొలువు తీర్చిన తర్వాత వారికి ఇచ్చిన ప్రాధాన్యత.. ప్రాజెక్టులు కట్టబెట్టే విషయంలోనూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

అందుకే అదానీ పెట్టుబడుల గురించి వీలైనంత మౌనాన్ని పాటించటం ద్వారా కేటీఆర్ కు లాభమే తప్పించి నష్టం ఉండదంటున్నారు. అందుకు భిన్నంగా వేలెత్తి చూపిస్తూ సీఎం రేవంత్ ను ఇరుకున పెట్టేసే ప్రయత్నాలు చేస్తే.. అందుకు ఫలితంగా మరిన్ని మాటలు తాను పడాల్సి వస్తుందన్న లాజిక్ ను మాజీ మంత్రి కేటీఆర్ ఎలా మిస్ అవుతున్నారన్నది అసలు ప్రశ్న. ఈ సింఫుల్ విషయాన్ని గుర్తించనంతవరకు కేటీఆర్ కు తిప్పలు తప్పవనే చెప్పాలి.


Tags:    

Similar News