మహిళలకు ముష్టి.. నటి ఖుష్బూ వివాదాస్పద వ్యాఖ్యలు!
సినీనటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట రచ్చ లేపుతున్నాయి.
సినీనటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట రచ్చ లేపుతున్నాయి. డీఎంకే ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న పథకాలతో పాటు.. గతకొన్ని రోజులుగా తమిళనాట వినిపిస్తున్న డ్రగ్స్ వ్యవహారంపైనా ఆమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోపక్క ఈమె చేసిన వ్యాఖ్యలపై డీఎంకే మహిళా విభాగం నిరసనకు తెరలేపింది!
అవును... తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం మహిళలకు నెల నెలా వెయ్యి రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకాన్ని ముష్టి, భిక్షగా ఖుష్బూ సుందర్ అభివర్ణించారు. తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఆమె... మహిళలకు వెయ్యి రూపాయలు ముష్టి వేసే బదులు, రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిని నిర్మూలించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలతో తమిళనాట పెను దుమారమే రేగింది.
ఇదే సమయంలో స్టాలిన్ సర్కార్ మహిళా ఓట్ల కోసమే వెయ్యి రూపాయలు ముష్టి ఇస్తుందని.. ఈ క్రమంలో డ్రగ్స్ నిరోధించడం మాత్రం మరిచిపోయిందని.. తమిళనాట డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిస్తే, ప్రజలు ప్రత్యేకంగా వెయ్యి రూపాయల భిక్షను తీసుకునే అవసరం ఉండదని అన్నారు.
కాగా... సుమారు 2వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ కేసులో తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాధిక్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించే క్రమంలో... పేద మహిళల కోసం స్టాలిన్ సర్కార్ తెచ్చిన పథకాన్ని ముష్టి అనడంపై మాత్రం తీవ్ర దుమారమే రేగింది.
ఇందులో భాగంగా... ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే మహిళా విభాగం నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో ఖుష్బూ సుందర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలుపుతుంది. దీంతో... ఈ విషయాలపై ఎక్స్ వేదికగా స్పందించిన ఖుష్బూ... తాను చేసిన వ్యాఖ్యలు కేవలం డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించడం కోసమే అని అన్నారు.