క్రికెట్ లీగ్ వదిలిపెట్టి.. పొలోమంటూ అంబానీ పెళ్లికి
ఐపీఎల్ లో కూడా విండీస్ స్టార్లదే హవా అన్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా మొదలుకుని.. అమెరికా వరకు.. బంగ్లాదేశ్ మొదలు దక్షిణాఫ్రికా దాక.. ప్రపంచ వ్యాప్తంగా ఏ మూల చూసినా క్రికెట్ లీగ్ లే లీగ్ లు. ఇందులో పెద్దన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). పెద్దఎత్తున ఆదాయం వస్తుండడంతో విదేశీ క్రికెటర్లు అందరూ తమ జాతీయ జట్ల కంటే క్రికెట్ లీగ్ లకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇదే అంశంపై ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక బోర్డులు గతంలో వాపోయాయి. ఇక వెస్టిండీస్ బోర్డు గురించి చెప్పాల్సిన పనే లేదు. అసలు విండీస్ క్రికెటర్లు తమ బోర్డునే లెక్కచేయరు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లీగ్ లు ఉంటే అక్కడ వాలిపోతుంటారు. ఐపీఎల్ లో కూడా విండీస్ స్టార్లదే హవా అన్న సంగతి తెలిసిందే.
కీరన్ ఇదేం పని..?
వెస్టిండీస్ ఆల్ రౌండర్లలో భారీకాయుడు కీరన్ పొలార్డ్ మేటి. టి20 ఫార్మాట్లో అతడు విధ్వంసక బ్యాట్స్ మన్. మెరుపు ఫీల్డర్. బంతితో కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ జట్టును గెలిపించేవాడు. పొలార్డ్ ను వెలుగులోకి తెచ్చింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. ముంబైకి ఆడకముందు వరకు అతడి ప్రతిభ ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు మాత్రం ఎక్కడ లీగ్ లు ఉంటే అక్కడ పొలార్డ్ ఉంటాడు.
ముంబైకి బైబై..
2022 వరకు ముంబై ఫ్రాంఛైజీకి ఆడిన పొలార్డ్.. ఆ ఏడాది నవంబరులో వీడ్కోలు పలికాడు. ఆ వెంటనే ముంబై బ్యాటింగ్ కోచ్ గానూ నియమితులయ్యాడు. అతడి ఆధ్వర్యంలోనే ముంబై గత సీజన్ ఆడింది. వచ్చే సీజన్ కోసం హార్దిక్ పాండ్యా సారథ్యంలో సిద్ధమవుతోంది. కాగా, ముంబై ఇండియన్స్ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానికి చెందిన సంస్థ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖేశ్ భార్య నీతా నేరుగా ముంబై ఫ్రాంచైజీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. ఇప్పుడు ముఖేశ్-నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్ తో జరగనుంది. జామ్ నగర్ లో దీనికి సంబంధించి ప్రి వెడ్డింగ్ జరుగుతోంది. అత్యంత అట్టహాసంగా సాగుతున్న ఈ వేడుకకు సినీ, క్రికెట్ స్టార్లను ఆహ్వానించారు. వారిలో కీరన్ పొలార్డ్ ఒకడు. అనంత్ పెళ్లి కోసం అతడికీ ఆహ్వానం పంపారు. దీంతోనే పాకిస్థాన్ క్రికెట్ లీగ్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి ఉన్నపళంగా వచ్చేశాడు. ఆ లీగ్ లో పొలార్డ్.. కరాచీ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆదివారం ముల్తాన్ సుల్తాన్ తో మ్యాచ్ ఉండగా.. దానిలో పొలార్డ్ పాల్గొనడం లేదు. జామ్ నగర్ లో అనంత్ ప్రి వెడ్డింగ్ కు హాజరైన తర్వాత సోమవారం కరాచీ కింగ్స్ తో చేరనున్నాడు.