అత్యల్ప ఓట్లతో అందలం ఎక్కారు !
దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పై చేయి సాధించి మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది
దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పై చేయి సాధించి మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇండియా కూటమి కూడా గట్టిగానే పోటిఇచ్చింది.. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 292, ఇండియా కూటమి 232, ఇతరులు 17 మంది గెలుపొందారు. అయితే.. ఏడు విడతల్లో హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కొందరు గత రికార్డులను తిరగరాస్తూ అత్యధిక మెజార్టీతో అఖండ విజయం నమోదు చేయగా, ఉత్కంఠ పోరులో స్వల్ప మెజారిటీతో పలువురు గెలుపొందారు. మహారాష్ట్రలో శివసేన అభ్యర్థి కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.
మహారాష్ట్రలోని ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన పార్టీ తరఫున రవీంద్ర దత్తారామ్ వైకర్, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే ) నుంచి అన్మోల్ కీర్తికర్ నిలబడ్డారు. వీరి మధ్య ఉత్కంఠ పోరు నెలకొనగా చివరకు 48 ఓట్ల తేడాతో రవీంద్ర విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో రవీంద్రకు 4,52,644 ఓట్లు రాగా ప్రత్యర్థి అన్మోల్‌కు 4,52,596 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 15,161 ఓట్లు వచ్చాయి.
కేరళలోని అత్తింగళ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ తన సమీప ప్రత్యర్థి సీపీఎం జాయ్ పై 684 ఓట్లతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌కు 3,28,051 ఓట్లు రాగా.. సీపీఎం అభ్యర్థి జాయ్ కు 3,27,367 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 9,791 ఓట్లు పడ్డాయి.