చంద్రబాబు అరెస్ట్ కుట్ర... వెనుక ఇద్దరు సీఎం లు, పీఎం!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్. ఇందులో భాగంగా ఈ కుట్ర వెనుక.. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని టీడీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాబు అరెస్ట్ ఒక కుట్ర అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేత మధుయాష్కీ గౌడ్!
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టుకు అవసరమైన ప్రాధమిక సమాచారం ఉందనే ఏసీబీ వాదనతో కోర్టు ఏకీభవించింది కాబట్టే రిమాండ్ కు ఇచ్చిందని ప్రభుత్వం నుంచి రియాక్షన్ వస్తున్న నేపథ్యంలో... ఇది ఒక కుట్ర అని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్. ఇందులో భాగంగా ఈ కుట్ర వెనుక.. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు.
ఏపీలో వైఎస్ జగన్ గెలవడం కోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారనేది విధితమే అని చెప్పుకొచ్చిన మధుయాష్కీ... చంద్రబాబుపై మోడీకి దుష్మనీ లాంటిది ఉందని వ్యాఖ్యానించారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారంటే దాని వెనుక కుట్ర ఉందని, తనకు సమాచారం ఉందని, ఈ అరెస్ట్ వెనుక మోడీ, కేసీఆర్ లు ఉన్నారని తెలిపారు.
వీరిద్దరూ కలిసి పన్నిన కుట్రలో భాగంగా ఏపీ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్ట్ చేసిందని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. అయితే... నేరం చేసినవారు ఎవరైనా శిక్షార్హులే అని చెప్పిన ఆయన... వారిని గుర్తించాల్సింది కోర్టులు అని చెప్పుకొచ్చారు. ఫలితంగా... బీజేపీ - బీఆరెస్స్ - వైసీపీలు మూడూ ఒకటే అని, బాబు అరెస్ట్ ద్వారా ఆ విషయం స్పష్టం అయ్యిందని మధుయాష్కీ గౌడ్ చెప్పుకొచ్చారు.
అనంగరం చంద్రబాబు అరెస్ట్ పై ఎల్బీనగర్ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతులు కట్టుకొని ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించిన మధుయాష్కీ... సీఎం కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్ మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రా నుంచి వచ్చి ఎల్బీనగర్ సెగ్మెంట్ లో నివాసం ఉంటున్న అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముళ్ల ఓట్ల కోసం సుధీర్ రెడ్డి నాటకాలాడుతున్నారని మధుయాష్కీ ఫైరయ్యారు.
మరోపక్క... చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆ అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఏపీ చీఫ్ పురందేశ్వరి బల్ల గుద్ది మరీ చెబుతున్న సంగతి తెలిసిందే. బాబు అరెస్ట్ ను ఆమె... జగన్ ఖాతాలో మాత్రమే వేస్తుంటే... కాంగ్రెస్ మాత్రం... జగన్ తో పాటు మోడీ, కేసీఆర్ ల ఖాతాలో కూడా వేస్తుంది!