మాగంటి వర్సెస్ యనమల... ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నారా?
ఈ విషయంలో వెనక్కి తగ్గేలా లేరన్నట్లుగా ఉందని అంటున్నారు! మరి, యనమల తగ్గుతారా.. మాగంటి సర్దుకుపోతారా అనేది వేచి చూడాలి!
ఏపీలో కూటమిలో భాగంగా సీట్ల పంపకాలు, అనంతరం సీట్ల సర్దుబాట్లు, కీలక స్థానాలను పక్కపార్టీలకు కేటాయించారనే విమర్శలు, అసంతృప్తుల అలకలు, రెబల్స్ రచ్చలు వెరసి... టీడీపీకి పెద్ద తలపోటే వచ్చిందని అంటున్నారు పరిశీలకులు! ఈ క్రమంలో పిఠాపురంలో ఏమి జరగబోతోందనే విషయంపై ఇప్పటికే ఒకవర్గం ప్రజానికానికి లోపల టెన్షన్ గానే ఉందని అంటున్నారు. మరోపక్క అనపర్తి ఆందోళన ఉండనే ఉందని చెబుతున్నారు.
ఇలా ప్రతీ జిల్లాలోనూ కనీసం ఒకటి రెండు స్థానాల్లో అసంతృప్తులు, రెబల్స్ ల సమస్యలు కూటమికి.. ప్రధానంగా టీడీపీలో ఉన్నాయని చెబుతున్నారు! దీనికంతటికీ... బాబు అడ్మినిస్ట్రేషన్ లోపమే కారణం అని అంటున్నారు! ఇదే సమయంలో ఇంతకాలం పార్టీకోసం కష్టపడిన వారికి కాకుండా.. వలస నేతలకు, డబ్బున్న వారికి మాత్రమే టిక్కెట్లు కేటాయించారనే రచ్చ కూడా ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో ఒక ఫ్యామిలీకి ఒక్క టిక్కెట్ మాత్రమే అని చెబుతోన్న చంద్రబాబు.. యనమల రామకృష్ణుడు ఫ్యామిలీకి మాత్రం నాలుగు టిక్కెట్లు ఇచ్చరానే రచ్చ కూడా ఆఫ్ ద రికార్డ్ టీడీపీ నేతల మధ్య నడుస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆయనకు ఎమ్మెల్సీ.. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ.. అల్లుడు మహేష్ యాదవ్ కి ఏలూరు ఎంపీ.. వియ్యంకుడు సుధాకర్ యాదవ్ కి కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించారని ఫైరవుతున్నారట.
ఈ నేపథ్యలో ప్రధానంగా ఏలూరు ఎంపీ టిక్కెట్ విషయంలో మాగంటి బాబు ఇవాళ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో భాగంగా.. ఏమాత్రం ముఖపరిచయం లేని, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని ఏలూరు ఎంపీ సీటులో ఎలా నిలబెడతారు అని ప్రశ్నించిన మాగంటి బాబు... బీసీలు ఎవరైనా ఏలూరు ఎంపీ టిక్కెట్ అడిగారా.. బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తెచ్చారు.. ఇది మాకు పొగబెట్టడం కాదా అని అధిష్టాణాన్ని ప్రశ్నించారు.
అనంతరం అసలు పాయింట్ కి వచ్చినట్లుగా స్పందించిన మాగంటి బాబు... బీసీ వర్గానికే టిక్కెట్లు ఇవ్వాలని అనుకుంటే నాలుగు సీట్లూ ఒకే కుటుంబానికి ఇస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మాకు మాటమాత్రమైనా చెప్పరా అని నిలదీశారు. ఇదే క్రమంలో.. అసలు పార్టీకి పుట్టా మహేష్ చేసిన సేవలు ఏమిటో చెప్పాలని అడుగుతూ.. తాను చేసిన సేవలేమిటో తెలియదా అని సూటిగా ప్రశ్నించారు.
దీంతో.. ఏలూరు ఎంపీ టిక్కెట్ టీడీపీలో సరికొత్త రచ్చకు దారితీసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! పైగా మాగంటి బాబు వ్యవహారం చూస్తుంటే... ఈ విషయంలో వెనక్కి తగ్గేలా లేరన్నట్లుగా ఉందని అంటున్నారు! మరి, యనమల తగ్గుతారా.. మాగంటి సర్దుకుపోతారా అనేది వేచి చూడాలి!