ఆర్థిక రాజధానిలో 'సేన' వర్సెస్ 'సేన'
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం శివసేన పార్టీకి ఒకప్పుడు కంచుకోటలాంటిది
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం శివసేన పార్టీకి ఒకప్పుడు కంచుకోటలాంటిది. 2022 లో ఆ పార్టీ ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే మధ్య నిట్టనిలువునా చీలిపోయింది. శివసేన పార్టీలో చీలిక తర్వాత జరుగుతున్న ఈ మొట్టమొదటి ఎన్నికలు ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, ఎన్నికల సంఘంతో అసలైన శివసేనగా గుర్తింపు పొందిన ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన పార్టీకి కీలకంగా మారాయి. ఉద్దవ్ కూటమికి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యనే అని చెప్పాలి.
ముంబయి నగరం పరిధిలో 10 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో కల్యాణ్, థాణే, ముంబై వాయువ్య, ముంబై దక్షిణ మధ్య, ముంబై దక్షిణ స్థానాల్లో శివసేన(షిండే), శివసేన(ఉద్ధవ్) పరస్పరం తలపడుతుండగా, పాల్ఘర్, ముంబై ఈశాన్య, ముంబై ఉత్తర మధ్య స్థానాల్లో బీజేపీ, శివసేన(ఉద్ధవ్), భీవండిలో బీజేపీ, ఎన్సీపీ, ముంబై ఉత్తర స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్నది.
గత రెండు ఎన్నికల్లోనూ ఈ పది స్థానాలను శివసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి గెలుచుకున్నది. 2014లో బీజేపీ 5, శివసేన 5, 2019లో బీజేపీ 4, శివసేన 6 స్థానాలను గెలుచుకున్నాయి. ఈసారి రెండు శివసేనలలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నదాని మీదనే పోటీదారుల భవిష్యత్ ఆధారపడి ఉంది.
థాణే జిల్లా ఇప్పటివరకు ఏక్‌నాథ్ షిండేకు బలమైన ప్రాంతం. గత రెండు ఎన్నికల్లోనూ థాణే జిల్లాలోని కల్యాణ్ స్థానం నుంచి ఏక్‌నాథ్ కుమారుడు శ్రీకాంత్ షిండే భారీ మెజారిటీతో గెలిచి ఇప్పుడు మూడోసారి బరిలో నిలిచారు. కల్యాణ్, థాణే స్థానాలను తిరిగి గెలిపించుకొని తన సొంత ప్రాంతంలో ఏక్‌నాథ్ పట్టు నిలుపుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ముంబై వాయువ్య, ముంబై దక్షిణ మధ్య, ముంబై దక్షిణ స్థానాల్లో శివసేన(ఉద్ధవ్)కి గట్టి పట్టు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిందూ భావజాలం ఉన్న శివసేన ఇండియా కూటమిలో చేరడం కొంత ప్రతికూల అంశం అయినా ఉద్దవ్ పట్ల ప్రజలలో సానుభూతి ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయి నగరం మీద ఏ సేన జెండా ఎగురుతుందా ? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.