ఫేస్ బుక్ లో తోపుదుర్తి బ్రదర్స్ ను ప్రశ్నించాడు.. రైలు పట్టాలపై శవమై తేలాడు!

ఫోటోల్ని ఫేస్ బుక్ లో పోస్టు చేసినప్పటి నుంచి తన కొడుకును రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లుగా వాపోయాడు.

Update: 2025-01-27 07:10 GMT

గత ప్రభుత్వంలో తనను వేధింపులకు గురి చేశారంటూ వైసీపీకి చెందిన నేతలపై ఇటీవల ఫేస్ బుక్ లో ప్రశ్నించిన యువకుడు ఒకరు అనుమానాస్పద రీతిలో రైలు పట్టాలపై శవంగా తేలటం సంచలనంగా మారింది. దీనికి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని తోపుదుర్తి గ్రామం వేదికగా మారింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. తోపుదుర్తి గ్రామానికి చెందిన 24 ఏళ్ల మహేశ్వరరెడ్డి ఇటీవల ఫేస్ బుక్ లో వైసీపీ హయాంలో తోపుదుర్తి సోదరులు తనపై అక్రమ కేసులు పెట్టారని.. వేధింపులకు గురి చేసినట్లుగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు.

2019లో తెలుగుదేశం పార్టీకి సహకరించారన్న కారణంగా తన కొడుకుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కోపం పెంచుకున్నట్లుగా మహేశ్వరరెడ్డి తండ్రి మీడియా ముందు ఆరోపణలు చేశారు. తమను వేధింపులకు గురి చేసే క్రమంలో తమ భూమిని సైతం ఆన్ లైన్ నుంచి తొలగించినట్లుగా వాపోయారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన పరిటాల శ్రీరామ్ ను తన కొడుకు కలిశాడని.. దీనికి సంబంధించిన ఫోటోల్ని ఫేస్ బుక్ లో పెట్టాడని చెప్పారు. ఫోటోల్ని ఫేస్ బుక్ లో పోస్టు చేసినప్పటి నుంచి తన కొడుకును రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లుగా వాపోయాడు.

ఇదిలా ఉండగా.. మహేశ్వర్ రెడ్డి మరణం అనుమానాస్పదంగా మారిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. మరణానికి కాసేపటి ముందు వరకు సరదాగా స్నేహితుడితో గడపటమేనని చెబుతున్నారు. శనివారం రాత్రి పాలచెర్లకు చెందిన మురళీ అనే యువకుడితో కలిసి సోములదొడ్డి గ్రామంలోని బస్టాపు వద్దకు వెళ్లటం.. అక్కడ కాసేపు గడపటం.. తనకు కాస్త పని ఉందని.. పని పూర్తి చేసుకున్న తర్వాత తాను ఫోన్ చేస్తానన్న మహేశ్వర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పని పూర్తి అయ్యిందని సోములదొడ్డికి రావాలంటూ రాత్రి పదిన్నర గంటల వేళలో మహేశ్ రెడ్డి ఫోన్ మెసేజ్ చేశాడు.

దీంతో సదరు యువకుడు టూ వీలర్ మీద సోములదొడ్డికి వచ్చాడు. అక్కడ మహేశ్వర్ రెడ్డి కనిపించలేదు. దీంతో అతని ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో అతడు మహేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులకు.. బంధువులకు ఫోన్ చేయగా.. వారంతా వెతకటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో సోములదొడ్డి.. నాగిరరెడ్డి గ్ారమాల మధ్య రైలు పట్టాల పక్కన శవంగా కనిపించాడు. దీనిపై స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమానాస్పద మరణంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News