పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా?
మోడీ సర్కారులో పవన్ కల్యాణ్ కు ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది.
ప్రముఖులు మాట్లాడే మాటలకు ఎందుకంత ప్రాధాన్యం అంటే.. వారి నోటి నుంచి అప్రయత్నంగా వచ్చే మాటలు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. కాకుంటే.. వారి మాటల్లోని మర్మాన్ని.. ఒక మాటకు.. మరో మాటకు మధ్యనున్న లింకును అర్థం చేసుకోగలిగితే కొన్ని అంశాలపై క్లారిటీ వచ్చేస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తన మాటలతో ఇప్పటివరకు కొన్ని అంశాల మీద కన్ఫ్యూజన్ ను క్లియర్ చేయటమే కాదు.. మరికొన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి.
మోడీ సర్కారులో పవన్ కల్యాణ్ కు ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది. ఇటీవల మహారాష్ట్రలో ముగిసిన ఎన్నికల్లో బీజేపీ గెలుపులోనూ పవన్ పాత్ర ఉందని.. ఆయనకారణంగా కమలం పార్టీ మరిన్ని సీట్లను సొంతం చేసుకున్నట్లుగా జాతీయ మీడియా సైతం ప్రచారం చేసింది. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమిలో పవన్ ఎంత కీలకమన్నట్లుగా వార్తలు వచ్చాయి. పవన్ కు మోడీ అమితమైన ప్రాధాన్యతను ఇస్తారని చెబుతారు.
అయితే.. ఆ మాటల్లో నిజం ఎంతన్న విషయం పవన్ తాజా మాటలు అసలు విషయాల్ని చెప్పేస్తాయి. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి అంశంపై అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇవ్వటమే కాదు.. ఆయన ఎమ్మెల్సీ అయ్యాకే.. మంత్రి అవుతారని స్పష్టం చేశారు. దీంతో.. పదవుల విషయంలో తమకు మరీ అంత కక్కుర్తి లేదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన చుట్టు ఉన్న వారికి సంబంధించిన కులాలు తెలియవని చెప్పిన పవన్ కల్యాణ్.. నాగబాబుకు అర్హత కారణంగానే మంత్రి అవుతున్నారే తప్పించి.. తన సోదరుడు కావటం వల్ల మాత్రం కాదని స్పష్టం చేయటం ఆసక్తికరంగా మారింది.
దీనికి మించిన మరో ఇంట్రస్టింగ్ అంశం ఏమంటే.. నాగబాబుకు రాజ్యసభ సీటు కట్టబెట్టేందుకు పవన్ ప్రయత్నించారంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయాన్ని పవన్ కన్ఫర్మ్ చేశారని చెప్పాలి. నాగబాబు ఎన్నో త్యాగాలు చేశారని.. గత ఎన్నికల్లో తాము పక్కాగా గెలిచే అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా.. బీజేపీ కోరటంతో వదులుకున్నట్లు చెప్పారు.
బీజేపీ కోసం పవన్ త్యాగాల పర్వం అక్కడితో ఆగలేదు. రాజ్యసభ అభ్యర్థిత్వం వస్తుందని అనుకున్నానని.. కానీ బీజేపీ వారి ఇబ్బందుల వల్ల ఇవ్వటం కుదర్లేదని చెప్పటం చూస్తే.. ప్రతి అంశంలోనూ పవన్ ను బీజేపీ వాడుకోవటమే తప్పించి.. ఆయనకు ఉపయోగపడిన వైనం కనిపించదు. తమకెంతో చేస్తున్న పవన్ కోరినట్లుగా రాజ్యసభ సీటు ఇవ్వకపోవటం దేనికి నిదర్శనం? మోడీ అనుకోవాలే కానీ.. పవన్ కోరిన రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించటం పెద్ద కష్టం కాదు. కానీ.. అదేమీ జరగలేదంటే.. ఏమిటి అర్థమన్నదే అసలు పాయింట్. ఆ విషయం పవన్ మాటల కారణంగా అందరికి తెలిసిందని చెప్పాలి.