ఉక్రెయిన్-రష్యా మధ్యలో చమురు దీపం.. మోదీ వెళ్లింది ఇందుకే!

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై రెండున్నరేళ్లు.. అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ మొదటినుంచి ఉక్రెయిన్ వైపు నిలిచాయి.

Update: 2024-09-09 17:30 GMT

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై రెండున్నరేళ్లు.. అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ మొదటినుంచి ఉక్రెయిన్ వైపు నిలిచాయి. రష్యా పక్షాన చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎటువైపు? దీనిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. అయితే, దశాబ్దాలుగా మనకు రష్యా మిత్ర దేశం. అమెరికా మనల్ని శత్రువుగా చూసిన రోజుల్లోనే రష్యా సాయం చేసింది. ఇంకోవైపు ఉక్రెయిన్ అటు మిత్ర దేశం కాదు. అలాగని విభేదాలూ లేవు. మన విద్యార్థులు వేల సంఖ్యలో ఆ దేశంలో చదువుతున్నారు. నూనెలు సహా ఇతర దిగుమతులు ఆ దేశం నుంచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి.

మధ్యవర్తిత్వం ఎందుకో?

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే మోదీ తాను మధ్యవర్తిత్వానికి సిద్ధం అని ప్రకటించారు. కాకపోతే ఆ వేడిలో ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా రష్యా-ఉక్రెయిన్ లలో పర్యటించి శాంతి సందేశం ఇచ్చారు. పైకి మోదీ శాంతి ప్రయత్నాలే కనిపిస్తున్నా.. వెనుక చాలా వ్యూహమే ఉంది. కాగా, రష్యా నుంచి యూరప్ దేశాలు చాలావాటికి ఇంధనం సరఫరా అవుతుంటుంది. ఆ దేశం ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన తొలి రోజుల్లో యూరప్ దేశాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఇప్పుడు భారత్ కూడా అదే పరిస్థితుల్లో ఉంది.

భారత ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన చమురు దిగుమతులకు ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు అత్యవసరం. అందుకే మోదీ చొరవచూపారని సమాచారం. ఓవైపు మోదీ వచ్చాక భారత్ లో చమురు ధరలు రెట్టింపు అయిన వైనాన్ని ప్రతిపక్షాలు దెప్పిపొడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంకా ధరలు పెరిగితే అది ఇబ్బందికర పరిస్థితికి దారితీస్తుంది. అందుకే ధరలను స్దిరంగా ఉంచేందుకు ఉక్రెయిన్-రష్యాలకు సమ దూరం పాటించారు మోదీ. తద్వారా చమురు రవాణా చైన్ దెబ్బతినకుండా చూశారు.

రష్యాతో పెట్టుకుంటే చమురు వదులుద్ది

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రతో ఆఫ్రికా దేశాలకు అత్యంత ముఖ్యమైన గోధుమల సరఫరా నిలిచిపోయింది. దీంతో మానవతా కోణంలో వాటిని ఎగుమతి చేసేందుకు రష్యా అంగీకరించింది. ప్రపంచ వాణిజ్యంపై, ముఖ్యంగా చమురు, గ్యాస్, గోధుమలు, ఎరువుల సరఫరాపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో రష్యా ఒకటి. కానీ, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో, ప్రపంచ చమురు సరఫరా దుర్లభమైంది. రష్యా చమురు లేకుంటే దీపం వెలగని పరిస్థితి యూరప్ దేశాలది. దీంతో అవి ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మరి భారత్ ముడి చమురులో దాదాపు 80 శాతం దిగుమతి చేసుకునే దేశం. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మనకు మరింత ఇబ్బందికరం అయ్యేది. కానీ, మోదీ విధానంతో నేర్పుగా ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు రాయితీతో రష్యా చమురు పొందింది భారత్. దౌత్య మార్గాలతో పశ్చిమ దేశాలతో సంబంధాలు చెడకుండా చూసుకుంది.

Tags:    

Similar News