ఆర్టికల్ 370 రద్దు.. కాశ్మీర్ లోయలో మోదీ కీలక పర్యటన అందుకేనా?
ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ కాశ్మీర్ లోయలో పర్యటిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
భారత రాజ్యాంగంలో జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశవిదేశాల్లో దీనిపై విమర్శలు వ్యక్తమైనా ప్రధాని మోదీ తలొగ్గలేదు. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్ నుంచి లడక్ ను విభజించి ఆ రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాలను చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ కాశ్మీర్ లోయలో పర్యటిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. గత నెల ఫిబ్రవరి 20న ప్రధాని మోదీ జమ్మూలో పర్యటించారు. ఆ రోజు రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే గత నెలలో ప్రధాని మోదీ కాశ్మీర్ కు వెళ్లలేదు. ఇప్పుడు కాశ్మీర్ కు వెళ్లారు. కాశ్మీర్ రాజధాని నగరం శ్రీనగర్ లో భారత సైన్యానికి చెందిన 15 కాప్స్ కేంద్ర కార్యాలయంలో ల్యాండ్ అయ్యారు. కాశ్మీర్ లో ప్రధాని రూ.6,400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ క్రమంలో శ్రీనగర్ లోని బక్షి స్టేడియంలో 'వికసిత్ భారత్... వికసిత్ జమ్మూకాశ్మీర్'' కార్యక్రమానికి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకుని కాశ్మీర్ లోయలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశాక ప్రధాని మోదీ మూడుసార్లు జమ్మూలోనే పర్యటించారు. కశ్మీర్ లోయకు వెళ్లడం మాత్రం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరికొన్ని నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని కాశ్మీర్ పర్యటన హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే జమ్మూకాశ్మీర్ లోని రాజకీయ పార్టీలు అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ కు వచ్చిన ప్రధాని మోదీ శ్రీనగర్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు.
అలాగే.. శ్రీనగర్ లోని హజ్రత్ బల్ మందిరంలో స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద రూ.1,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా మోదీ ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జమ్మూకాశ్మీర్‌లో కొత్తగా నియమితులైన దాదాపు 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని అపాయింట్మెంట్ లెటర్ లను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మహిళలు, రైతులు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడతారు. అనంతరం 2,000 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.