లక్షద్వీప్ లో మోడీ 'స్నార్కెలింగ్'..వైరల్
లక్షద్వీప్‌లో అత్యంత సాహసోపేతమైన స్నార్కెలింగ్ ను మోడీ విజయవంతంగా పూర్తి చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మోడీ అక్కడ సముద్రంలో స్నార్కెలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాధ్యక్షులు, దేశ ప్రధానులలో మోడీ కూడా ఒకరు. 2014లో మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన అనతి కాలంలోనే భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇక, 2020లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో కొన్ని దేశాలకు ఔషధాలను సరఫరా చేయడం, స్వయంగా మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకోవడం వంటి నిర్ణయాలు మోడీ పాలనా దక్షతకు నిదర్శనం. ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు మోడీ మాత్రమే తీసుకోగలరు. అయితే, కేవలం రాజకీయాలలో మాత్రమే కాదు...వ్యక్తిగతంగానూ మోడీ సాహసోపేతంగా చేసిన 'స్నార్కెలింగ్' ఫీట్ వైరల్ గా మారింది.
లక్షద్వీప్‌లో అత్యంత సాహసోపేతమైన స్నార్కెలింగ్ ను మోడీ విజయవంతంగా పూర్తి చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మోడీ అక్కడ సముద్రంలో స్నార్కెలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్కూబా డైవ్ సూట్ వేసుకొని సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాసులను ప్రత్యక్షంగా వీక్షించడాన్ని స్నార్కెలింగ్ అంటారు. సముద్ర గర్భంలో చాలా లోతుకు వెళ్లే ఈ ఫీట్ చేయడం ఓ సాహసం. అయితే, ఏడు పదుల వయసులో కూడా మోడీ ఈ సాహసాన్ని ధైర్యంగా చేయడం విశేషం. ఈ ఫీట్ కు సంబంధించిన చిత్రాలను మోడీ ఎక్స్ లో పంచుకున్నారు.
లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి తాను ఇంకా సంభ్రమాచార్యంలో ఉన్నానని మోడీ అన్నారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయని చెప్పారు. లక్షద్వీప్ కేవలం ద్వీపాల సమూహం కాదు, ఇది సంప్రదాయాల వారసత్వం, అక్కడ ప్రజల స్ఫూర్తికి నిదర్శనం అని కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పని చేయాలో ఆలోచించేందుకు ఈ వాతావరణం అవకాశం కల్పించిదని వివరించారు. సాహసాలు చేయాలనుకునేవారి జాబితాలో లక్షద్వీప్ చేర్చుకోవాలని సలహా ఇచ్చారు.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పథకాలు పొందుతున్న వివిధ లబ్ధిదారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఆయుష్మాన్ భారత్, పీఎం-కిసాన్, పీఎం-ఆవాస్, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి పథకాల నుండి లబ్ధి పొందుతున్న వ్యక్తులు ఉన్నారు. అగట్టి, బంగారం, కవరత్తిలో ప్రజలతో మమేకమయ్యే అవకాశం లభించిందని, లక్షద్వీప్ ప్రజలకు ధన్యవాదాలు అని మోడీ అన్నారు.