సోనియాను పలకరించిన మోడీ.. సమాధానం ఇదే!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపు సంభాషించారు.

Update: 2023-07-20 14:03 GMT

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన రోజే.. ఉభయ సభలు అట్టుడికి పోయాయి. అన్ని వ్యవహారాలను పక్కనబెట్టి మణిపుర్‌ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోకి సంబంధించిన అంశంపైనే చర్చించాలని, అది కనీస బాధ్యత అని ఉభయ సభల్లోని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రెండు సభలూ రేపటికి వాయిదా పడ్డాయి.

ఆ సంగతి అలా ఉంటే... పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున లోక్‌ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపు సంభాషించారు. ఇటీవల సోనియా, రాహుల్‌ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కావడాన్ని ప్రస్తావించిన ప్రధాని.. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమయంలో తాను క్షేమంగానే ఉన్నట్లు బదులిచ్చిన సోనియా... మణిపుర్‌ అంశంపై చర్చించాలని ప్రధాని మోడీని కోరినట్లు కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌ ఛౌదురి తెలిపారు.

కాగా... భోపాల్‌ లోని రాజా భోజ్ ఎయిర్‌ పోర్ట్‌ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం అత్యవసర ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. బెంగళూరులో విపక్ష భేటీ అనంతరం ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానంలో ఆక్సిజన్ తక్కువ అవ్వడమే దీనికి కారణం అని తెలుస్తుంది.

ఈ సందర్భంగా... కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, తన తల్లి సోనియా గాంధీ విమానంలో కూర్చున్న ఫొటోపై రాహుల్ గాంధీ ఇన్‌ స్టాగ్రామ్‌ లో భావోద్వేగ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో కూర్చున్న సోనియా.. ఆక్సిజన్‌ మాస్కును ధరించిన ఫొటోను రాహుల్‌ పంచుకున్నారు. "తీవ్ర ఒత్తిడిలోనూ ఎంతో ధైర్యంగా ఉన్న అమ్మ.." అని ఆయన ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు రాహుల్‌.

సాధారణంగా... లోక్‌ సభ సమావేశాల తొలిరోజు సభ్యులు అంతా పార్టీలకు అతీతంగా పలుకరించుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా సభ ప్రారంభానికి ముందు వివిధ పార్టీలకు చెందిన సభ్యులను ప్రధాని పలుకరించారు. ఈ క్రమంలోనే విపక్ష నేతల వద్దకు ప్రధాని మోడీ... కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీని పలకరించారు.

మరోవైపు మణిపుర్‌ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై మోడీ మీడియా ముందు స్పందించారు. ఆ దారుణానికి పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదలమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విపక్షాలు తప్పుపట్టాయని తెలుస్తుంది. సభలో చర్చించమంటే.. మైకులముందు స్పందించడం ఏమిటని విమర్శిస్తున్నారు.

ఇదే అంశంపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించకుంటే న్యాయస్థానమే చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది. మహిళలను హింసకు సాధనాలుగా ఉపయోగించడం అంగీకరించలేని విషయం అని పేర్కొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags:    

Similar News