వైసీపీకి అత్యంత విశ్వసనీయుడు కూడా గుడ్‌ బై!

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

Update: 2024-08-29 06:15 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామాలు ప్రకటించగా తాజాగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు షాకిచ్చారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బాంబుపేల్చారు. తనతోపాటు మరో వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌ రావు కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక స్థానాల్లో ఒకటైన రేపల్లెకు ఇంచార్జిగా ఉన్న మోపిదేవి వెంకట రమణారావును తప్పించి ఆ స్థానంలో కొత్త అభ్యర్థి ఈవూరు గణేశ్‌ కు వైసీపీ అధినేత జగన్‌ సీటు కేటాయించారు. దీనిపై మోపిదేవి వెంకట రమణ అప్పట్లోనే తన అసంతప్తిని వ్యక్తం చేశారు.

కాగా ప్రముఖ వైద్యుడిగా పేరున్న డాక్టర్‌ ఈవూరు గణేశ్‌ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన 26 వేలకు పైగా ఓట్లు సాధించారు. గణేశ్‌.. గౌడ సామాజికవర్గానికి చెందినవారు.

కాగా మోపిదేవి వెంకట రమణ 2009 ఎన్నికల్లో రేపల్లె నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్సార్‌ మంత్రివర్గంలో పెట్టుబడులు, ఓడరేవులు, మౌలిక సదుపాయాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మోపిదేవి జైలుపాలయ్యారు. తన మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రేపల్లెలో బరిలోకి దిగి మోపిదేవి వెంకట రమణ ఓటమి పాలయ్యారు. ఈ రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌ విజయం సాధించారు.

తనవల్లే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మోపిదేవి మంత్రి పదవి పోగొట్టుకున్నారని.. జైలుపాలయ్యారని వైఎస్‌ జగన్‌ కు ఓ కన్సర్న్‌ ఉంది. దీంతో 2019లో మోపిదేవి వెంకట రమణారావు రేపల్లెలో ఓడిపోయినప్పటికీ ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీగా ఆయనను ఎంపిక చేశారు. ఆ తర్వాత శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మోపిదేవి వెంకట రమణారావును రాజ్యసభకు పంపారు.

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి వాస్తవానికి మోపిదేవి వెంకట రమణ వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉంది. అయితే జగన్‌.. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఈవూరు గణేశ్‌ కు సీటు ఇచ్చారు. దీనిపట్ల మోపిదేవి అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు లేదా తన సోదరుడు మోపిదేవి హరనాథ్‌ బాబుకు సీటు ఇవ్వాలని కోరారు. అయితే జగన్‌ పట్టించుకోలేదు.

2020లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవికి 2026 వరకు పదవీ కాలం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేయాలని మోపిదేవి నిర్ణయించుకున్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నారు.

ఎన్నికల ముందే రాజీనామా చేయాలనుకున్నానని.. ఆ సమయంలో చేయడం సరికాదని ఊరుకున్నట్టు మోపిదేవి తెలిపారు. తన రాజీనామా వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయన్నారు. అన్నీ బయటకు చెప్పుకోలేనని తెలిపారు. తనతోపాటు బీద మస్తాన్‌ రావు కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదన్నారు. అసెంబ్లీ టికెట్‌ ఇవ్వనప్పుడే మనస్తాపం చెందానని తెలిపారు. పార్టీకి ద్రోహం చేయకూడదని అప్పుడు రాజీనామా చేయలేదని చెప్పారు.

కాగా మత్స్యకార సామాజికవర్గంలో కీలక నేతగా ఉన్న మోపిదేవి వెంకట రమణారావు, యాదవ సామాజికవర్గానికి చెందిన బీద మస్తాన్‌ రావు రాజీనామా చేయడం వైసీపీకి కోలుకోలేని దెబ్బేనని అంటున్నారు.

Tags:    

Similar News