రూ.1.50 లక్షల కోట్ల మూసీ మనకు అవసరమా రేవంత్?

కొన్ని ప్రాజెక్టులను టేకప్ చేయకూడదు. ఎంత చేసినా ఫలితం రాలేని వాటిపై పేరు కోసం ఫోకస్ పెడితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు

Update: 2024-07-21 12:30 GMT

కొన్ని ప్రాజెక్టులను టేకప్ చేయకూడదు. ఎంత చేసినా ఫలితం రాలేని వాటిపై పేరు కోసం ఫోకస్ పెడితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధి నుంచే ఆయన హైదరాబాద్ రూపురేఖల్ని మూసీ ప్రాజెక్టుతో మార్చేస్తానన్న మాటల్ని చెప్పుకొచ్చారు. మూసీ ప్రక్షాళన కోసం.. దాని రూపురేఖలు మార్చటం కోసం భారీ ప్రాజెక్టులకు తెర తీస్తున్న ముఖ్యమంత్రుల్లో రేవంత్ మొదటివాడు కాదు. అలా అని చివరివాడు కాబోడు.

రేవంత్ కు ముందు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ సైతం.. ఈ ప్రాజెక్టు మీద కలలు కని.. దాన్ని సాకారం చేయటం అంత తేలికైన విషయం కాదన్న విషయాన్ని గుర్తించి వదిలేశారని చెబుతారు. తన పదేళ్ల పాలనలో మూసీ మీద చాలానే ఫాంటసీ సినిమాల్ని చూపించారు కేసీఆర్. ఆ క్రమంలో కొన్ని గ్రాఫిక్స్ ను విడుదల చేశారు కూడా. మూసీ మీద తన ఊహాజనిత ప్రపంచాన్ని ప్రకటనల రూపంలో ఆవిష్కరించారు కూడా. అయినప్పటికీ అదేమీ సాధ్యం కాలేదు.

మూసీ ప్రక్షాళనతో పాటు.. మూసీ తీరంలో స్పీడ్ బోట్ లతో తిరగొచ్చన్న మాట మాత్రమే కాదు.. చాలానే విషయాల్ని చెప్పారు. ఇందుకోసం దగ్గర దగ్గర రూ.40వేల కోట్ల మేర ఖర్చు అవుతుందన్న లెక్కల్ని వెల్లడించారు. దీని కోసం భారీ సెటప్ సిద్ధం చేశారు. ఇంకేముంది.. మూసీ ప్రక్షాళనే మిగిలిందంటూ హడావుడి చేశారు. ఇంత చేసిన కేసీఆర్.. మూసీ ప్రక్షాళన విషయంలో అడుగు ముందుకు వేసింది లేదు. దీనికి కారణం.. తాను ఎంత కల కన్నా.. వాస్తవంలోకి అవేమీ సాధ్యం కావన్న విషయాన్ని గుర్తించటంతో.. కామ్ గా ఉన్నారని చెబుతారు.

కేసీఆర్ టేకప్ చేసి వదిలేసిన మూసీ ప్రాజెక్టును తాజాగా సీఎం రేవంత్ చేపట్టారు. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు. రూ.లక్షన్నర కోట్ల వ్యయంతో మూసీ రూపురేఖలు మారుస్తామన్న మాట చెప్పారు. ఈ మాట విన్నవారంతా అవాక్కు అయ్యే పరిస్థితి. తన పదవీ కాలమైన ఐదేళ్లలో మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఏడాదికి రూ.30వేల కోట్లు అవసరం. ఒకవేళ.. తాను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ నమ్మి ఉన్నారనుకున్నా.. ప్రతి ఏడాది రూ.15వేలకోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే ఇంత భారీ బడ్జెట్ సాధ్యం కాదనే మాట వినిపిస్తోంది. అంతేకాదు.. తాజాగా చేసిన ప్రకటనను పరిగణలోకి తీసుకుంటే.. మూసీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ ఖర్చు చేస్తానని చెబుతున్న రూ.లక్షన్నర కోట్లను చూస్తే.. అంత భారీ కాళేశ్వరం ప్రాజెక్టుకు మించిన ప్రాజెక్టుగా చెప్పాలి. ఇంత భారీ ఖర్చు చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణకు ఉందా? అన్నది ప్రశ్న.

మూసీని తాను కలలు కన్నట్లుగా చేస్తే.. చరిత్రలో నిలిచిపోతానన్న ఆలోచన రేవంత్ కు ఉండొచ్చు. దానికి బదులుగా.. హైదరాబాద్ మహానగరం మొత్తం మెట్రో.. రాపిడ్ ట్రాన్స్ పోర్టు సిస్టంతో పాటు రోడ్లు.. డ్రైనేజీ లాంటి వాటి మీద ఫోకస్ చేస్తే.. వేగవంతమైన ఫలితం ఉండటమే కాదు.. హైదరాబాద్ మహానగరానికి మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత రేవంత్ కు దక్కుతుంది. అందుకు భిన్నంగా మూసీ మీద డీప్ లవ్ లో పడిన రేవంత్.. రూ.లక్షన్నర కోట్ల ఖర్చుకు రెఢీ కావటంతో దెబ్బ ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News