కాంగ్రెస్.. బీఆర్ఎస్ లో ముస్లిం ఎమ్మెల్యేలే లేరు.. ఆశ్చర్యమే..

తెలంగాణలో ఎన్నికల అంకం ముగిసింది. ఇక మిగిలింది ప్రభుత్వ ఏర్పాటు.. నేడే, రేపో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొలువుదీరనున్నారు

Update: 2023-12-05 13:30 GMT

తెలంగాణలో ఎన్నికల అంకం ముగిసింది. ఇక మిగిలింది ప్రభుత్వ ఏర్పాటు.. నేడే, రేపో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొలువుదీరనున్నారు. 119 మంది ఎమ్మెల్యేలూ ఆ తర్వాత ప్రమాణం చేయనున్నారు. ఆపై శాసన సభ శీతాకాల సమావేశాలు జరిగేందుకు వీలుంది. ఇక ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం చూస్తే.. కాంగ్రెస్ పార్టీ తరఫున 64 మంది నెగ్గారు. బీఆర్ఎస్ 39 దగ్గర ఆగిపోయింది. సీపీఐ 1, బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించాయి.

రెడ్లు 43 మంది .. వెలమలు 13

ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సామాజికవర్గాల వారీగా చూస్తే.. ఏకంగా అన్ని పార్టీల నుంచి 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం సభ్యుల్లో వీరి వాటా 36.13 శాతం కావడం గమనార్హం. తెలంగాణ జనాభాలో రెడ్ల శాతం 8 వరకు ఉంటుంది. ఇక వెలమలు 13 మంది గెలిచారు. వారి జనాభా అర శాతం మాత్రమేనని చెబుతారు. అయినా 13 మంది వెలమలు ఎమ్మెల్యేలు కావడం అంటే వారి నాయకత్వాన్ని ఒప్పుకోక తప్పదు. మరోవైపు కమ్మలు నలుగురు, బ్రాహ్మణ, వైశ్య ఒక్కొక్కరు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మొత్తం 119 సీట్లలో ఓసీలైన వీరి శాతమే 52 కావడం గమనార్హం. ఇక బీసీల్లో అన్ని కులాల నుంచి 19 మంది గెలిచారు. మైనారిటీలు ఏడుగురు నెగ్గారు. ఎస్సీ (19), ఎస్టీ (12) రిజర్వుడ్‌ పోగా రాష్ట్రంలో 88 అసెంబ్లీ స్థానాలు జనరల్‌. సుమారు 16 శాతం మాత్రమే బీసీలు గెలిచారు.

ఆ ఏడుగురు ముస్లింలు మజ్లిస్ వారే..

తెలంగాణలో గెలిచిన ఏడుగురు ముస్లిం ఎమ్మెల్యేలు మజ్లిస్ పార్టీ వారే కావడం గమనార్హం. అందులోనూ 88 జనరల్ స్థానాల్లో ఏడు వీరే నెగ్గారు. ఇక్కడ ఎంఐఎం తప్ప మరొకరికి చాన్సు ఉండదనే సంగతి తెలిసిందే. ఈ లెక్కన జనరల్ సీట్లు 81 మాత్రమే అని లెక్కేసుకోవాలి. ఇక ఎంఐఎం అత్యధికంగా ముస్లింలకే టికెట్లు ఇస్తుంది. పాతబస్తీలో నెగ్గిన ఏడుగురూ వారే. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత అసెంబ్లీలో వీరు తప్ప ముస్లిం ఎమ్మెల్యేలు ఎవరూ లేరు.

ఆ రెండు పార్టీల నుంచి ఓడారు

లౌకిక పార్టీలుగా చెప్పుకొనే కాంగ్రెస్, బీఆర్ఎస్ ముస్లింలకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మనది లౌకిక దేశం కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలి. రాజకీయాల విషయానికి వస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ముస్లింలను బుజ్జగిస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తుంటుంది. మరోవైపు ముస్లింల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చాయి. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో ఆ రెండు పార్టీల నుంచి ఒక్కరు కూడా ముస్లిం ఎమ్మెల్యే ఎన్నిక కాలేదు. కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ అర్బన్ లో సీనియర్ నేత షబ్బీర్ అలీ పరాజయం పాలయ్యారు. నాంపల్లిలో కచ్చితంగా గెలుస్తాడనుకున్న ఫిరోజ్ ఖాన్ ఓటమి చెందారు. పాత బస్తీలో మరెక్కడా గెలవలేదు. జూబ్లీహిల్స్ లో టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ను బరిలో దింపినా ఫలితం దక్కలేదు. ఇక బీఆర్ఎస్ బోధన్ టికెట్ ను సిటింగ్ ఎమ్మెల్యే షకీల్ కు ఇచ్చింది. ఆయనా ఓటమి పాలయ్యారు. బహదూర్ పురా, చార్మినార్ లోనూ ఆ పార్టీ అభ్యర్థులకు గెలుపు దక్కలేదు. దీంతో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు రెండింటిలోనూ ముస్లిం ఎమ్మెల్యేలు లేకుండాపోయారు.

Tags:    

Similar News