ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొడుకును అరెస్టు చేశారా? అసలేమైంది?

అంతేకాదు.. ముఠా జయసింహ స్నేహితుల మీద కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎమ్మెల్యే కుమారుడి రోల్ ఏమీ లేదు.

Update: 2023-11-30 04:32 GMT

సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ యూనివర్సిటీలోనూ వచ్చే సందేశాల్లో నిజమెంత? అబద్ధమెంత? లాంటి ప్రశ్నలు వేసుకుంటే.. నూటికి ఇరవై శాతం తప్పించి.. మిగిలిన 60 శాతం అసత్యాలే ఉండే పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాతో పోటీ పడుతున్నట్లుగా కొన్ని టీవీ చానళ్లు.. పీడీఎఫ్ పత్రికలు కొన్ని నిజాల గురించి క్రాస్ చెక్ చేసుకోకుండా తమకు తోచిన రీతిలో సమాచారాన్ని ప్రజలకు అందించే విషయంలో ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే.. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వ్యవహరిస్తున్నారు ముఠాగోపాల్. ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా ఆయన అనారోగ్యానికి గురి కావటంతో.. ఆయన తరఫున ఆయన కుమారుడు ముఠా జయసింహ విపరీతంగా శ్రమిస్తున్నాడు. తండ్రి అనారోగ్యంగా ఉండి ప్రచారాన్ని చూసుకునే పరిస్థితుల్లో లేనప్పటికీ.. ఆలోటు కనిపించకుండా ఉండేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు.

ఇలాంటి వేళ.. ఇటీవల చోటు చేసుకున్న ఒక పరిణామానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో హైదరాబాద్ కమిషనరేట్ సీపీ కీలక నిర్నయాన్ని తీసుకున్నారు. ముఠా జయసింహ ఇల్లుగా చెప్పుకునే అపార్టు మెంట్ వద్ద డబ్బులు పంచుతూ.. ఆయన స్నేహితులు ఇద్దరిని పట్టుకోవటం.. కేసు నమోదు చేసే విషయంలో స్థానిక పోలీసులు ప్రదర్శించిన అలసత్వంపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించిన రీతిలో.. డీసీపీ.. ఏసీపీతో పాటు స్థానిక సీఐ మీద సస్పెండ్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు.. ముఠా జయసింహ స్నేహితుల మీద కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎమ్మెల్యే కుమారుడి రోల్ ఏమీ లేదు. అయితే.. అతని స్నేహితులు కావటం ఇబ్బందికర పరిస్థితి. ఇలాంటివేళలో ఒక ప్రముఖ ఛానల్ లో ఎమ్మెల్యే కుమారుడు జయసింహను పోలీసులు అరెస్టు చేసినట్లుగా బ్రేకింగ్ న్యూస్ ను ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ముఠా జయసింహ తన ఇంట్లోని సదరు టీవీ చానల్ పెట్టి.. దాని ముందు తాను కూర్చొని.. తనను అరెస్టు చేయలేదని.. సదరు చానల్ లో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం. కీలకమైన ఎన్నికల పోలింగ్ ముందు.. ఇలాంటి న్యూసెన్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జరిగే నష్టాన్నిఅర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరపడి ప్రతిది ఇష్టారాజ్యంగా ప్రచారం చేయటం వల్ల జరిగే ఇబ్బందులు చాలా ఉంటాయన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News