కలకలం రేపిన ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసంపై పోలీసుల మాటేంటి?

ఇంతకూ ముత్యాలమ్మ గుడి దగ్గర ఏం జరిగింది?

Update: 2024-10-16 04:53 GMT

డిజిటల్ మీడియాతో పోలిస్తే ప్రింట్ మీడియాలో (దినపత్రికల్లో) కొన్ని ఉదంతాలు స్థానికంగా పెను సంచలనంగా మారింది. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోకి జొరబడిన ఒక వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్నటంతో.. ఇతనితో పాటు మరో ఇద్దరు ఉండటం.. వారంతా పారిపోతే.. ఈ వ్యక్తి మాత్రం స్థానికులకు దొరికిపోయాడు. ఇంతకూ ముత్యాలమ్మ గుడి దగ్గర ఏం జరిగింది? విగ్రహా ధ్వంసానికి కారణమేంటి? ధ్వంసం చేసిన వాళ్లలో ఎందరు పట్టుబడ్డారు? ఈ మొత్తం ఉదంతంపై పోలీసులు ఏమంటున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే..

సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ టెంపుల్ లోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైనం కలకలాన్ని రేపటమేకాదు.. స్థానికంగా ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. ఈ ఉదంతంపై పలువురు బీజేపీ నేతలతో పాటు.. ప్రజాప్రతినిదులు సీన్లోకి వచ్చి.. దీనిపై సీరియస్ అయ్యారు.ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనిది మజ్లిస్ ఎమ్మెల్యే ఒకరు మీడియా ముందుకు వచ్చి.. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించటమే కాదు..నిందితుడిపై దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు.

ముత్యాలమ్మ టెంపుల్ అపార్టుమెంట్ల మధ్య ఈ ఆలయం ఉంటుంది. దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. సోమవారం తెల్లవారుజామున (నాలుగున్నర గంటల ప్రాంతంలో) ఒక వ్యక్తి ఆలయం గేటునుగట్టిగా కాలితో తన్ని లోపలకు ప్రవేశించాడు. అతను తలపై టోపీని ధరించిన వైనాన్ని గుర్తించారు. ఆలయంతో పాటు పక్కనున్న ఇళ్లల్లోని సీసీ కెమేరాల్లో అతడి దుశ్చర్య మొత్తం రికార్డు అయ్యింది. ఆలయంలోని వెళ్లి.. గర్భగుడి గేటు విరగ్గొట్టి లోపలకు వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఉద్దేశపూర్వకంగా అమ్మవారి విగ్రహంపై దాడి చేసిన అతడ్ని.. స్థానికులు పట్టుకున్నారు. అతడి చేష్టల కారణంగా శబ్దం కావటంతో స్థానికులు ఆలయం బయటకు వచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వారు తప్పించుకున్నారు. స్థానికులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు అక్కడకు వెళ్లటం.. నిందితుడి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు.

బీఆర్ఎస్ కు చెందిన ముఖ్యనేతలు మొదలు.. అన్ని పార్టీలకు చెందిన వారు ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ఉదంతాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవటానికి పోలీసులు వెనుకాడుతున్నట్లుగా ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి.. జరిగిన ఘటనను స్థానికుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించేలా ప్లాన్ చేయాల్సిన అవసరాన్ని చెబుతున్నారు. ఈ తరహా ఘటనలు మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఈ తరహా ఘటనలపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News