కిర‌ణ్‌కుమార్‌.. కిర‌ణాలు ఎక్క‌డా ప‌డ‌డం లేదే!

ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఊసు ఎక్క‌డా వినిపించ‌డం లేదు

Update: 2023-11-09 03:30 GMT

ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఊసు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డున్నారో.. ఏం చేస్తున్నారో.. కూడా తెలియ‌డం లేద‌ని బీజేపీలోనే ఒక టాక్ నడుస్తోంది. మ‌రోవైపు కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఎక్క‌డెక్క‌డి నుంచో నాయ‌కుల‌ను బీజేపీ నేత‌లు చేర్చుకుని ఈ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. కానీ, హైద‌రాబాద్‌పై ప‌ట్టున్న నాయ‌కుడు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గంలో మంచి ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా కిర‌ణ్‌కుమార్ రెడ్డి సేవ‌లు ఎవ‌రూ వినియోగించుకోవ‌డం లేదా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కిర‌ణ్‌కుమార్‌రెడ్డి గ‌తంలో కాంగ్రెస్‌లో సుదీర్ఘ‌కాలం ప‌నిచేశారు. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించారు. ఈ క్ర‌మంలోనే అసెంబ్లీలో ఆయ‌న స్పీచ్ కూడా గంభీరంగా సాగింది. (ఇప్ప‌టికీ సీఎం కేసీఆర్‌.. ఈయ‌న‌ను ప్ర‌త్య‌క్షంగా పేరు పెట్టి చెప్ప‌కపోయినా.. నాటి ముఖ్య‌మంత్రి అంటూ.. తెలంగాణ వ‌స్తే.. నీటి యుద్ధాలు జ‌రుగుతాయ‌ని, రాష్ట్రం చీక‌టిలోకి వెళ్లిపోతుంద‌ని అన్నార‌ని.. కానీ, ఇప్పుడు తెలంగాణ‌లో స‌స్య‌శ్యామలంగా పంట‌లు పండుతున్నాయ‌ని.. వెలుగు విర‌జిల్లుతున్నాయ‌ని చెబుతున్నారు.) ఇక‌, ఆ త‌ర్వాత‌.. సొంత పార్టీ పెట్టుకున్న కిర‌ణ్‌కుమార్ రెడ్డి చ‌తికిల‌ప‌డ్డారు.

ఆ త‌ర్వాత కొన్నేళ్ల‌పాటు ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. త‌ర్వాత మ‌ళ్లీ కాంగ్రెస్ బాట ప‌ట్టారు. త‌ర్వాత మ‌ళ్లీ ప్రాదాన్యంలేదంటూ.. బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్నారా? లేక‌.. బీజేపీ అధిష్టాన‌మే ఆయ‌న‌ను సైలెంట్ చేసిందా? అనేది చ‌ర్చ‌నీయాంశం. కిర‌ణ్‌కుమార్ బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌చారం చేస్తే.. దీనిని అడ్వాంటేజ్‌గా చేసుకుని.. కేసీఆర్ ప్ర‌భృతులు తెలంగాణ సెంటిమెంటును మ‌రోసారి రెచ్చ‌గొట్టి.. ఇలాంటి వారు మ‌న‌కు అవ‌స‌ర‌మా? అనే చ‌ర్చ లేవ‌నెత్తే అవ‌కాశం ఉంది.

బ‌హుశ‌.. దీనిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ అధిష్టానం కిర‌ణ్‌ను సైలెంట్ చేసింద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. త‌న‌కు బీజేపీలోనూ ప్రాధాన్యం లేద‌ని.. భావిస్తున్న కిర‌ణ్ త‌నంత‌ట త‌నే సైలెంట్ అయ్యార‌నే వాద‌న‌కు కూడా బ‌లం చేకూరుతోంది. ఏదేమైనా కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి జాడ‌, వాయిస్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వినిపించ‌డ‌మూ లేదు. మ‌రి ఆయ‌న వ్యూహం .. పార్టీ పంథా ఏంట‌నేది తెలియాలంటే.. ఇంకా వెయిట్ చేయాలేమో చూడాలి.

Tags:    

Similar News