రంగంలోకి దిగిన బాలయ్య... హిందూపురంలో కొత్త టెన్షన్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యంత కీలక నేతలు, అతిరథ మహారథులు వంటి నేతలు సైతం కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కూడా ప్రచారాలు ప్రారంభించేశారు

Update: 2024-03-27 06:14 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యంత కీలక నేతలు, అతిరథ మహారథులు వంటి నేతలు సైతం కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కూడా ప్రచారాలు ప్రారంభించేశారు. ఈ క్రమంలో.. ఈసారైనా గెలవాలని కొందరు, ఈసారి కూడా గెలవాలని ఇంకొందరు, ఈ ఒక్కసారి గెలిస్తేచాలని మరికొందరు... ఎవరి లక్ష్యాలతో వారు ప్రచారాల్లోకి దిగిపోయారు. ఈ సమయంలో బాలయ్య కూడా రంగంలోకి దిగిపోయారు.

అవును... హిందూపురం నుంచి ఇప్పటికే రెండు సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ... రానున్న ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. దీంతో.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార కార్యక్రమాల్లోకి దిగిపోయారు. స్టార్ క్యాంపెనియర్ గా రాష్ట్రం మొత్తం ప్రచారం చేసే సత్తా ఉన్న బాలయ్య.. ప్రస్తుతం మాత్రం హిందూపూరం పైనే పూర్తి శ్రద్ధపెట్టినట్లు తెలుస్తుంది.

వాస్తవానికి హిందూపురం అనేది టీడీపీ కంచుకోట! 1983 నుంచి ఈ నియోజకవర్గంలో పసుపు జెండా మినహా మరో జెండా ఎగిరిన దాఖళాలు లేవు! అభ్యర్థి ఎవరైనా సరే ఇక్కడ టీడీపీ జెండా ఎగరాల్సిందే.. నిలవాల్సిందే! ఈ నేపథ్యంలో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం పెద్ద సమస్య కాదని అంటున్నారు. ఆయన రాష్ట్రం మొత్తం స్టార్ క్యాంపెనింగ్ చేసి, ప్రచారానికి నాలుగు రోజుల ముందు వచ్చి నియోజకవర్గంలో కారుపై ఒక రౌండ్ వేసినా పని అయిపోద్దని చెబుతున్నారు!

అయితే... ప్రస్తుతం పరిస్థితిలు అలా లేవనే చర్చ నడుస్తోందని తెలుస్తుంది. బాలయ్యకు హ్యాట్రిక్ విజయం దక్కకుండా అడ్డుకట్టవేయాలని అధికార వైసీపీ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుందని.. అన్నీ వర్గాల్లోనూ మొహరించిందని.. బాలకృష్ణ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా హిందూపురంలో సరికొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారంట. దీంతో.. బాలయ్యే స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం మొదలుపెట్టారు!

దీంతో... ఎన్నికలు పూర్తయ్యే వరకూ షూటింగ్ లకు దూరంగా, నియోజకవర్గానికి దగ్గరగా ఉండాలని బాలయ్య నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా షెడ్యూల్ ఉన్నప్పటికీ... ఎన్నికలు ముగిసే వరకూ సెట్స్ పైకి వెళ్లడం మానుకోవాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు ఊహాగాణాలు వెలువడుతున్నాయి.

కాగా... హిందూపురంలో వైసీపీ తమ అభ్యర్థిగా బీసీ (కురుబ) సామాజికవర్గానికి చెందిన టీ.ఎన్. దీపికను బరిలోకి దించిన సంగతి తెలిసిందే. దీంతో... చాలా కాలంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో బాలయ్య గట్టిపోటీని ఎదుర్కొంటున్నారని అంటున్నారు.

Tags:    

Similar News