బాబు డైరెక్షన్ లోనే భువనేశ్వరి !
టీడీపీ అధినేత చంద్రబాబు లోని ఎమోషన్స్ ని పూర్తి స్థాయిలో బయటపెట్టిన ఘనత మాత్రం వైసీపీదే.
టీడీపీ అధినేత చంద్రబాబు లోని ఎమోషన్స్ ని పూర్తి స్థాయిలో బయటపెట్టిన ఘనత మాత్రం వైసీపీదే. బాబు ఎంతటి కఠిన పరీక్షలను అయిన ముఖంలో ఎలాంటి భావాలు తెలియకుండా ఎదుర్కొనే స్థిత ప్రజ్ఞతను సాధించారు. అలాంటి చంద్రబాబు మూడేళ్ళ క్రితం మీడియా ముందుకు వచ్చి బోరున ఏడవడం చూసి తెలుగు జాతి విస్తుపోయింది. బాబు గురించి తెలిసిన వారు సైతం షాక్ తిన్నారు.
నాడు అసెంబ్లీలో బాబు కుటుంబం మీద వైసీపీ నేతలు ఏవో అనుచితం వ్యాఖ్యలు చేశారన్న దాని మీద ఆయన మీడియా ముందు అలా తన బాధను వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు కంట కన్నీరు అలా ఒలికింది. ఇపుడు జైలు గోడల మధ్యన చంద్రబాబు ఉన్నారు. ఆయన తన జీవితం మొత్తాన్ని అక్కడ నెమరువేసుకుంటున్నాను అని తాజాగా ప్రజలకు రాసిన ఒక బహిరంగ లేఖలో వెల్లడించారు.
నా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం కళ్ల ముందు రీళ్ళ మాదిరిగా తిరుగుతోంది అని బాబు భావోద్వేగానికి గురి అయ్యారు. తాను జైలు గోడల మధ్యన లేను, ప్రజల మనసులలో బంధీగా ఉన్నాను అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉండగా తాను జైలులో ఉన్న సమయంలో తన తరఫున తన ఇల్లాలు ఎన్టీయార్ కుమార్తె అయిన భువనేశ్వరిని జనంలోకి పంపుతున్నాను అని బాబు లేఖలో పేర్కొనడం విశేషం.
తాను అందుబాటులో లేని సమయంలో ప్రజల తరఫున వారి సమస్యల మీద పోరాటం చేయమని భువనేశ్వరికి కోరాను అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అందుకు ఆమె అంగీకరించింది అని బాబు తెలిపారు. నా అక్రమ అరెస్ట్ తో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి భువనేశ్వరి ప్రజల ముందుకు వస్తోందని బాబు అంటున్నారు.
ఏపీలో వైసీపీ అరాచకం పాలనను ఎండగట్టడానికి భువనేశ్వరి వస్తోంది అని ఆయన పేర్కొనడం విశేషం. ఆమెని దీవించండి అంటూ బాబు లేఖలో పేర్కొన్నారు. అంటే బాబు డైరెక్షన్ లోనే భువనేశ్వరి జనంలోకి వస్తున్నారు అని అర్ధం అవుతోంది. తన తరఫున ప్రజలలోకి వెళ్లాలని బాబు ఆమెను కోరారని అంటున్నారు.
ఎన్టీయార్ బిడ్డ అని బాబు లేఖలో ప్రస్తావించడం ద్వారా అటు నందమూరి బ్లడ్ ని ఇటు నారా వారి భార్యగా ఉంటూ ఈ వైపు నుంచి వచ్చే బంధాన్ని కంటిన్యూ చేస్తూ రెండు వైపులా మద్దతు కూడగట్టుకోవడానికే ఆమెని రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది. ఇక పైన ఉన్న దేవుడు, ప్రజలు తనకు ధైర్యం అని చంద్రబాబు చెబుతున్నారు.
తన మీద పెట్టిన అక్రమ కేసుల నుంచి తొందరలో బయటకు వస్తాను అని బాబు చెబుతున్నారు. సూర్యుడు వచ్చాక చీకటి తొలగిపోతుందని అంటున్నారు. జగన్ పాలనను నియంత పాలనతో బాబు పోల్చారు, మంచి పాలన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తాను ఎమోషన్ కి గురి అవుతూ ప్రజలను ఎమోషన్ లోకి నెట్టేలా బాబు లేఖ ఉంది. దీని మీద జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.