ఒడిషా నవీన్ ట్రాజడీ పొలిటికల్ స్టోరీ!

ఒడిషాలో నవీన్ పట్నాయక్ ఓటమి పాలు అయ్యారు. ఆయన ఓటమి ఎవరూ ఊహించలేనిది

Update: 2024-07-11 04:10 GMT

ఒడిషాలో నవీన్ పట్నాయక్ ఓటమి పాలు అయ్యారు. ఆయన ఓటమి ఎవరూ ఊహించలేనిది. బిజూ పట్నాయక్ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసి 2000 సంవత్సరం నుంచి 2024 దాకా ఏకంగా 24 ఏళ్ల పాటు సీఎం గా పనిచేసిన చరిత్ర ఆయనది. ఇప్పటికి అయిదు సార్లు గెలిచిన నవీన్ ఈసారి కూడా గెలిస్తే ఆయన దేశంలోనే అత్యధిక కాలం సీఎం గా పనిచేసిన రికార్డుని సొంతం చేసుకునేవారు.

అయితే ఆ రికార్డుని దక్కకుండా చేసింది బీజేపీ. దానికి ఆ పార్టీ చాలానే చేసింది. అన్నింటికంటే భారీ వ్యూహం ఏంటి అంటే నవీన్ కి చాలా ఏళ్ళుగా పక్కనే ఉంటూ వచ్చిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పాండ్యన్ ని బూచిగా చూపించి ఆయనే నవీన్ ని నడిపిస్తున్నారు అని ఆయన ఒడిషా అస్తిత్వానికి ముప్పు అని జనాలకు చెప్పడం ద్వారా ఘన విజయం సాధించింది.

తమిళనాడుకు చెందిన పాండ్యన్ ఒడిషాలోనే ఐఏఎస్ అధికారిగా సేవలను పూర్తి స్థాయిలో అందించారు. ఆయనే నవీన్ కి అన్ని విధాలుగా అండగా ఉండేవారు. పాలనా పరమైన సలహాలు ఇస్తూ ముందుకు నడిపించారు అని పేరు. ఆయన్ని అలా జనాలు కూడా మెచ్చుకునేలా తీరు ఉండేది. ఇక ఆయన 2023లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి బిజూ జనతాదళ్ లో చేరారు.

నవీన్ కి కన్నూ ముక్కూగా ఉన్న పాండ్యన్ ఎక్కడ తన అవకాశాలు ఏగరేసుకుని పోతారో అని సొంత పార్టీలోని వారు కలత చెందారు ఇక బీజేపీ అయితే నవీన్ ఆయననే తరువాత సీఎం గా చేస్తారు అని ప్రచారం చేసింది. అది జనాలకు బాగా ఎక్కేసింది.

ఎక్కడ నుంచో ఉద్యోగం కోసం వచ్చిన పాండ్యన్ ఒడిషా వాళ్లను పాలించడం ఏంటి అన్న బీజేపీ వాదనను జనాలు నమ్మారు. పైగా నవీన్ అనారోగ్యంతో ఉన్నారని ఆయనను గెలిపించినా పాండ్యన్ చేతికే అధికారాలు వెళ్తాయని బీజేపీ చేసిన ప్రచారం వారిలో ఆత్మ గౌరవ నినాదంగా మారింది.

అంతే కాదు నవీన్ అనారోగ్య పరిస్థితులను కూడా బీజేపీ ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించుకుంది. ఇలా ఎన్ని చేయాలో అన్నీ చేసింది. దాంతో పాతికేళ్ళుగా ప్రజలను పాలిస్తూ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వచ్చిన నవీన్ ఒక్క దెబ్బకు ఓడారు. ఆ దెబ్బ తన నీడ లాంటి పాండ్యన్ వల్లనే అని ఇపుడు జనాలు అంటున్నారు.

నిజానికి బీజేపీకి అర్బన్ లోనే పట్టు ఉంది.కానీ పాండ్యన్ అంశం, ఆయనే నవీన్ కాకుండా సీఎం అవుతారు అని జరిగిన ప్రచారం వేరే రాష్ట్రానికి చెందిన వారికి పగ్గాలు ఎందుకు అప్పగించాలి అన్న ప్రజల ఆత్మ గౌరవం చివరికి రూరల్ లో కూడా బీజేపీకి అఖండ మెజారిటీని కట్టబెట్టాయి. నవీన్ బాబుని మాజీ సీఎం గా చేశాయి.

ప్రజలలో ఈ ఆత్మ గౌరవ నినాదం ఎంతలా పనిచేసింది అంటే బీజేడీకి ఒక్క ఎంపీని కూడా ఇవ్వనంతగా. 20 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుంది అంటే అది పాండ్యన్ మహిమ అంటున్నారు. రాజకీయాల్లో నేతలు కొన్ని తెలిసి కొన్ని తెలియక తప్పులు చేస్తారు. నవీన్ బాబు పాండ్యన్ అనే అధికారిని అధికంగా నమ్మారు. ఆయన కూడా అలాగే నిజాయతీ గా పనిచేశారు. కానె సొంత పార్టీలో అది అసమ్మతికి దారి తీస్తుందని జనాల్లో ఆత్మ గౌరవ సమస్యగా మారుతుందని నవీన్ అసలు ఊహించలేకపోయారు.

అందుకే దాదాపు ఎనభయ్యేళ్ళ వయసులో మాజీ సీఎం కావాల్సి వచ్చింది. బతికి ఉన్నంతవరకూ ఓటమి ఎరగని నేతగా ఉంటారనుకున్న నవీన్ బాబు జీవిత చరమాంకంలో ఈ పొలిటికల్ ట్రాజెడీ స్టోరీ గుర్తుండిపోయేలా సాగింది. ఎందుకంటే ఆయన రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక చోట భారీ తేడాతో ఓటమి పాలు కావడం. మొత్తానికి ఒడిషాలో కమలం వికసించింది. 2029 ఎన్నికల నాటిని నవీన్ ఆరోగ్యంగా ఉండి పోటీ చేస్తారా లేదా అన్నది భవిష్యత్తు తేల్చాలి.

Tags:    

Similar News