ఆ మాజీ మంత్రికి ప్రాధాన్యత... మళ్ళీ లొల్లి ?

దీనికి ఒక మాజీ మంత్రి వైఖరి ప్రధాన కారణం అని అంటున్నారు. ఆయనే అనిల్ కుమార్ యాదవ్.

Update: 2024-07-06 03:52 GMT

వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు. అలా జిల్లా జిల్లాకూ అనేక కారణాలు కనిపిస్తాయి. పార్టీని గ్రౌండ్ లెవెల్ వరకూ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. కానీ జగన్ మాత్రం ఓటమి తమకు కాదని ప్రజలు కేవలం చంద్రబాబు ఇచ్చే సంక్షేమ హామీలకు మోసపోయారన్న ధోరణిలో మాట్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీలో అధికారంలోకి వచ్చిన తరువాత చాలా జిల్లాలలో లొల్లి ఉంది. అంతే కాదు హార్డ్ కోర్ జిల్లాలలో సైతం కీలక సామాజిక వర్గాల మధ్య చిచ్చు రాజుకుంది. దానిని జగన్ అధికారంలో ఉండగా పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఉదాశీనంగా వ్యవహరించారు అని అంటూంటారు.

నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. అలాంటి జిల్లాలో చూస్తే కనుక 2024 ఎన్నికల్లో మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. దీనికి ఒక మాజీ మంత్రి వైఖరి ప్రధాన కారణం అని అంటున్నారు. ఆయనే అనిల్ కుమార్ యాదవ్. ఆయన వైఖరి నచ్చక ఆఖరుకు సొంత బాబాయి రూప్ కుమార్ యాదవ్ ఎన్నికల ముందు టీడీపీ లోకి వెళ్లారు.

అయినా సరే జగన్ ఆయనకు నచ్చచెప్పకుండా వెనకేసుకుని రావడం వల్లనే భారీ మూల్యం చెల్లించారు అని అంటున్నారు. నెల్లూరు జిల్లా అంటే పెద్దా రెడ్లదే పెత్తనం. వారిదే రాజకీయ ఆధిపత్యం. అటువంటి జిల్లాలో జగన్ అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చారు.

సామాజిక సమీకరణలలో భాగంగా ఇస్తే ఇవ్వవచ్చు కానీ అనిల్ మాత్రం జగన్ ని మాత్రమే గౌరవిస్తూ ఏకంగా నెల్లూరు పెద్దా రెడ్ల మీదనే విమర్శలు చేస్తూ టార్గెట్ చేయడంతోనే వారంతా క్రమంగా దూరం అయ్యారని అంటున్నారు. అది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మొదలైంది. ఆ తరువాత చాలా మంది అనిల్ పెత్తనాన్ని సహించలేక దూరం అయ్యారు.

ఆఖరుకు నెల్లూరులో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సైతం పార్టీని వీడి పోవడానికి కారణం అయింది. అంతే కాదు ఆనం రామ నారాయణరెడ్డి సహా ఎందరో పార్టీని వీడిపోయారు. అయినా సరే అధినాయకత్వం మాత్రం మేలుకోకపోగా నెల్లూరు పెద్దారెడ్లను పట్టించుకునే విధంగా వ్యవహరించలేదు అని అంటున్నారు. ఏది ఏమైనా భారీ మూల్యం వైసీపీ చెల్లించుకుంది.

ఇదిలా ఉంటే నెల్లూరు జైలులో పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్ వచ్చినపుడు కూడా ఆయన పక్కన అనిల్ ఉండడంపైన వైసీపీలో చర్చ సాగింది అని అంటున్నారు. జగన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని పార్టీలో అన్ని వర్గాలకు పెద్ద పీట వేయాలని జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని సూచనలు వస్తున్నాయట.

Tags:    

Similar News