నెట్ ‘స్పీడ్’ తగ్గింది.. షాకింగ్ గా తాజా సర్వే వివరాలు!
జేబులో డబ్బులున్నా లేకున్నా.. చేతిలో ఉండే మొబైల్ ఫోన్ లో డేటా తప్పనిసరి అన్న రోజులు వచ్చేశాయి.
జేబులో డబ్బులున్నా లేకున్నా.. చేతిలో ఉండే మొబైల్ ఫోన్ లో డేటా తప్పనిసరి అన్న రోజులు వచ్చేశాయి. రోజువారీగా తిండి ఎంత ముఖ్యమో.. ఫోన్ లో డేటా అంతే ముఖ్యమన్న కాలమిది. డేటా లేనిదే గంట కూడా గడపలేని స్థితికి అందరూ వచ్చేశారు. ఇలాంటి వేళ.. టెలికం కంపెనీలు చెప్పే మాటలకు.. చేసే పనులకు సంబంధం లేదన్న అభిప్రాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
కమ్యూనిటీ ప్లాట్ ఫామ్ లోకల్ సర్కిల్స్ వార్షిక బ్రాడ్ బ్యాండ్ సర్వేలో యాభై శాతానికి పైగా వినియోగదారులు తమ నెట్ స్పీడ్ సరిగా లేదని.. కంపెనీ చెప్పిన మాటను నిలబెట్టుకోవటం లేదని ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. భారత్ లోని 86 శాతం మంది యూజర్లు ఫైబర్.. బ్రాడ్ బ్యాండ్.. డిజిటల్ సబ్ స్క్రైబర్స్ లేదంటే ఫిక్సెడ్ లైన్ కనెక్షన్ ద్వారా ఇంట్లోనే నెట్ కు కనెక్టు అవుతున్నట్లుగా సర్వే రిపోర్టు పేర్కొంది.
అయితే.. ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది తాము వాడే ఇంటర్నెట్ స్పీడ్ మీద ఫిర్యాదులు చేస్తుండటం గమనార్హం. కనెక్టివిటీ సమస్యలు ఎదురవుతున్నట్లుగా వారు చెబుతున్నారు. అంతేకాదు.. తాము ప్రస్తుతం ఉన్న సర్వీస్ ప్రొవైడర్ నుంచి వేరే సర్వీసుకు మార్చేందుకు మక్కువ చూపే వారు 70 శాతానికి పైగా ఉండటం గమనార్హం. అయితే.. నాణ్యమైన సేవల్ని అందిస్తుందన్న నమ్మకం వస్తే చాలన్న విషయాన్ని వారు చెబుతున్నారు.
ఇక.. టెలికం కంపెనీలకు కంప్లైంట్లు ఇస్తే వాటిని పరిష్కరించటానికి సరాసరిన 24 గంటల సమయాన్ని తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. వినియోగదారులకు మాట ఇచ్చినట్లుగా స్పీడ్ లేని అంశంపై ట్రాయ్ ఏం చేస్తోందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజా సర్వే నేపథ్యంలో.. టెలికం కంపెనీల మీద వచ్చే ఫిర్యాదులపై అధికారులు సత్వరం స్పందించాల్సిన అవసరం ఉంది.