ఫ్లైట్ దిగినంతనే కారు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొత్త సర్వీస్
హైదరాబాద్ మహానగరానికి దేశ విదేశాల నుంచి వస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు.. ప్రముఖులు వస్తున్నారు.
రీల్ లో కనిపించే కొన్ని సీన్లు రియల్ లైఫ్ లో పెద్దగా కనిపించవు. చాలా అరుదైన వారికి మాత్రమే లభించే కొన్ని సర్వీసులు.. సరిగ్గా ప్రయత్నించాలే కానీ సాధ్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ.. వాటికి సంబంధించిన అవగాహన లేకపోవటం ఒక కారణం. రూ.10 లక్షల ఖర్చుతో ప్రైవేటు చాపర్ అందుబాటులోకి వస్తుంది. అదేమీ కష్టం కాదు. ఇవన్నీ పక్కన పెట్టి.. తాజా విశేషం ఏమంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యేక టెర్మినల్ ఓపెన్ అయ్యింది. ఇది కేవలం సెలబ్రిటీలు.. ప్రముఖులు.. శ్రీమంతులు.. అపర కుబేరులకు మాత్రమే సొంతమని చెప్పాలి.
హైదరాబాద్ మహానగరానికి దేశ విదేశాల నుంచి వస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు.. ప్రముఖులు వస్తున్నారు. హైదరాబాద్ లో పెరిగిన ఫార్మా.. ఐటీ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు.. ఇప్పటికే ఉన్న వ్యాపారాల్ని విస్తరించేందుకు వీలుగా ప్రత్యేక విమానాల్లో వచ్చి పోయే సంపన్నుల సంఖ్య ఎక్కువైంది.
అలాంటి వారికి అవసరమైన ప్రత్యేక టెర్మినల్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టును నిర్వహించే జీఎంఆర్ గుర్తించింది. అందుకే.. ఇలాంటి వారి కోసం ప్రత్యేక టెర్మినల్ ను ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో పెరిగిన ప్రైవేట్ జెట్ విమానాల రాకపోకలకు తగ్గట్లు.. వారికి అవసరమైన సౌకర్యాల్ని అందించేందుకు వీలుగా ప్రత్యేక టెర్మినల్ ను తాజాగా ఏర్పాటు చేశారు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినల్ కు పక్కనే ఉండే ఈ కొత్త టెర్మినల్ కు పరిమితమైన యాక్సిస్ ఉండదు. ఈ టెర్మినల్ లో ల్యాండ్ అయిన ప్రైవేట్ జెట్ విమానాల పక్కనే కారు సిద్ధంగా ఉండటం.. విమానం దిగినంతనే కారులో బయటకు వెళ్లే సౌకర్యం ఉంటుంది. దాదాపు 11 వేల చదరపు అడుగుల పొడవైన ఈ టెర్మినల్ కు ప్రత్యేక ప్రవేశ ద్వారంతోపాటు.. కార్ పార్కింగ్ కు స్థలాన్ని కేటాయించారు.
దేశీయ.. అంతర్జాతీయ ప్రయాణికులకు అవసరమైన సేవల్ని ఇక్కడ అందిస్తారు. లాంజ్, ప్రైవేట్ లాంజ్, ప్రత్యేకంగా రాకపోకల సదుపాయం.. బ్రీత్ అనలైజర్ టెస్టు సెంటర్, చెక్ ఇన్, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలు, హ్యాండ్ బ్యాగేజ్ తనిఖీ, సెక్యూరిటీ తనిఖీలు, డ్యూటీ ఫ్రీ షాపింగ్, ప్రత్యేక వైఫై సౌకర్యాన్ని కల్పిస్తారు. మొత్తంగా అత్యంత విలాసవంతంగా ఉండే ఈ టెర్మినల్ సంపన్నుల అభిరుచులు.. అవసరాలకు తగినట్లుగా ఉంటాయని చెబుతున్నారు.