డేంజర్ బెల్స్... ఇజ్రాయేల్-హమాస్ యుద్ధం విస్తరిస్తోందా?
బుధవారం నాటి పరిణామాలను చూస్తుంటే ఇది మరిన్ని దేశాలకు విస్తరించడంతోపాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రత్యక్షంగా ఎంటరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఊహించని విధంగా మొదలైన ఇజ్రాయేల్ – హమాస్ ల మధ్య యుద్ధం చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరిగిందని తెలుస్తుంది. గత రెండు రోజులుగా ఇజ్రాయేల్ మరింత దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య యుద్ధం విస్తరిస్తుందనే సంకేతాలు తాజాగా వెలువడుతునాయి. దీంతో... ఇది ఎంత దూరం వెళ్తుందనే టెన్షన్ మొదలైపోయింది.
అవును... పాలస్తీనా - ఇజ్రాయెల్ యుద్ధం అక్కడితో ఆగేలా కనిపించడం లేదని తెలుస్తుంది. బుధవారం నాటి పరిణామాలను చూస్తుంటే ఇది మరిన్ని దేశాలకు విస్తరించడంతోపాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రత్యక్షంగా ఎంటరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే లెబనాన్, సిరియాల నుంచీ ఇజ్రాయెల్ వైపు రాకెట్లు దూసుకువస్తున్నాయి.
ఇదే సమయంలో... ఖతార్, ఇరాన్ లాంటి దేశాలు పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నాయి. మరోవైపు అమెరికా, ఈయూ దేశాలు ఇజ్రాయెల్ కు పూర్తి అండదండలు అందిస్తున్నాయి. దీంతో ఇది కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితి లోనే ఆందోళనలు నెలకొన్నాయని అంటున్నారు.
అయితే ఇది అధికారికంగా లెబనాన్, సిరియా యుద్ధానికి దిగినట్లు భావించకపోయినా... లెబనాన్, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్ దళాలు ఈ దాడులకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. వాస్తవానికి పైకి చెప్పకున్నా... హమాస్ కు సిరియా, లెబనాన్ మద్దతుదారులు. దీంతో ఈ రెండూ కూడా పూర్తిస్థాయిలో యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్ పై ముప్పేట దాడిలా అవుతుందని అంటున్నారు.
మరోవైపు ఇజ్రాయేల్ పై హమాస్ దాడిని ఇరాన్, ఖతార్, కువైట్ లు సమర్ధిస్తున్న నేపథ్యంలో... ఇజ్రాయెలీలపై హమాస్ దాడిలో ఇరాన్ హస్తం ఉందని తేలితే పరిస్థితులు మరింత దారుణంగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా అని పశ్చిమాసియాలోని అన్ని అరబ్ దేశాల మద్దతూ హమాస్ కి ఉందనుకోలేకపోవడం కాస్త ఉపశమనం.
వీటిలో ఈజిప్టు, బహ్రెయిన్, యూఏఈ... హమాస్ దాడిని తీవ్రంగా ఖండింస్తుండగా... కీలకమైన సౌదీ అరేబియా ఎవరి పక్షం వహించకుండా తటస్థంగా ఉంది. కారణం... మారుతున్న ప్రపంచ సమీకరణాల్లో సౌదీ, యూఏఈలాంటి దేశాలు స్వావలంబన దిశగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్, అమెరికాలతో సత్సంబంధాలను పెంచుకోవాలని భావిస్తున్నాయి. దీంతో హమాస్ కు వారి మద్దతు లభించడం లేదని అంటున్నారు.
సంధికి టర్కీ ప్రయత్నం:
ఆ సంగతి అలా ఉంటే... ప్రస్తుతం ఇజ్రాయేల్ – హమాస్ మధ్య సంధి ప్రయత్నాలు మొదలుపెట్టింది టర్కీ. ఇందులో భాగంగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే హమాస్ తో సంప్రదింపులు జరిపేందుకు టర్కీ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యబ్ ఎర్డోగాన్ సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఒక అడుగు వేసిన ఎర్డోగాన్... సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్ మాడ్ జిద్ టెబౌన్ తో మాట్లాడారని తెలుస్తుంది. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధాన్ని ఆపేందుకు తమ పరిధి మేరకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఎర్డోగాన్ నిర్ణయించుకున్నట్లు టర్కీ మీడియా వర్గాలు తెలిపాయి.