కొత్త ట్రెండ్: ఓటేస్తే ఎన్ని ఆఫర్లో.. సంస్థల సరికొత్త ప్రచారం
అంతేకాదు.. ఓటేస్తే తమ సంస్థల ఉత్పత్తుల విషయంలో ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
ప్రతి విషయాన్ని సెలబ్రేషన్ చేసుకునే అలవాటు ఈ మధ్యన ఎక్కువైన సంగతి తెలిసిందే. అలానే.. ప్రతి సందర్భాన్ని తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ తమను తాము మార్కెటింగ్ చేసుకునే ధోరణి కొన్ని సంస్థల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీనికి సామాజిక బాధ్యత ట్యాగ్ లైన్ తో ఆ సంస్థకు కొంత మైలేజీతో పాటు.. ఉచిత ప్రచారం లభిస్తోంది. అయితే.. చేసేది మంచి పని కావటంతో ఈ తీరును విమర్శంచాల్సిన అవసరం లేదు. కాకుంటే.. గత ఎన్నికల్లో ఒకట్రెండు సంస్థలు మాత్రమే ముందుకు వస్తే.. ఈ రోజు (సోమవారం) పోలింగ్ జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు ఆసక్తికర ఆఫర్లకు తెర తీశాయి.
ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతో కలిసి ప్రచారం చేస్తున్న సదరు కంపెనీల్లో పలు రంగాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. అంతేకాదు.. ఓటేస్తే తమ సంస్థల ఉత్పత్తుల విషయంలో ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ ఆఫర్లను చూసినప్పుడు అవకాశాల్ని అందిపుచ్చుకునే కంపెనీ చురుకుదనం ముచ్చటేయటం ఖాయం. అదే సమయంలో ఓటింగ్ శాతం కొంత పెరిగితే అంతకు మించి కావాల్సిందేముంది? అన్నది కూడా ఒక పాయింటే. పోలింగ్ రోజున వివిధ సంస్థలు అందిస్తున్న ఆఫర్లను చూస్తే..
పోలింగ్ రోజున ఆఫర్ల అలవాటును షురూ చేసిన సంస్థల్లో ర్యాపిడో ముందుందని చెప్పాలి. ఈ రోజున (మే 13న) పోలింగ్ జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్ తో పాటు కరీంనగర్.. ఖమ్మం.. వరంగల్ నగరాల్లో ర్యాపిడో సంస్థ ఫ్రీ రైడ్స్ సేవను అందిస్తోంది. ఓటర్లను పోలింగ్ స్టేషన్ల వరకు ఉచితంగా తీసుకెళ్లనుంది. ఓటు వేసేందుకు వెళ్లే దివ్యాంగులు ఆటోలు.. క్యాబ్ లను ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. కాకుంటే.. దీని కోసం ర్యాపిడో యాప్ లో ‘‘VOTE NOW" అనే కూపన్ కోడ్ ను ఉపయోగించటం ద్వారా ఫ్రీ రైడ్ ను సొంతం చేసుకోవచ్చు.
ఉచిత కన్సల్టేషన్.. ల్యాబ్ టెస్టుల్లో రాయితీ హైదరాబాద్ మహానగరంలో పేరున్న పెద్ద ఆసుపత్రుల్లో ఒకటి ఏఐజీ. ఓటుహక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి తమ ఆసుపత్రిలో ఉచిత కన్సల్టెన్సీ ఉంటుందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ కం చీఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఓటేసి.. ఆసుపత్రికి వచ్చి వేలికి ఉన్న సిరాగుర్తును చూపించటం ద్వారా తమ ఆసుపత్రిలో ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ మరియు ల్యాబ్ పరీక్షల్లో 50 శాతం రాయితీ పొందొచ్చని పేర్కొన్నారు. అయితే.. ఈ ఆఫర్ సోమవారం సాయంత్రం (మే 13) ఆరు గంటల వరకే ఉంటుందని పేర్కొన్నారు.
ఓటు కోసం ఊరుకు వెళుతున్నారా?
ఓటు వేసేందుకు ఊరికి వెళ్లే వారి కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు ఓటర్లను ఊళ్లకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా బస్సుల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. రెడ్ బస్.. అభి బస్ లాంటి సంస్థలు టికెట్లపై 20 శాతం రాయితీని అందిస్తున్నట్లుగా ప్రకటించాయి.
ఫ్లైట్ టికెట్ పై రాయితీ తొలిసారి ఓటేస్తున్న యువ ఓటర్ల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రత్యేకమైన ఆఫర్ ను ప్రకటించింది. చదువు కోసమో.. జాబ్ కోసమో వేరే నగరాల్లో ఉండే యూత్.. ఓటు వేయటం కోసం తమ సొంతూరుకు వెళ్లే వారికి తాము ప్రయాణించే టికెట్ మీద 19 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా పేర్కొంది. ఈ ఆఫర్ ను ఏప్రిల్ 19న ప్రకటించగా.. ఎయిరిండియా విమానాలకు జరుగుతున్న ప్రతి 20 బుకింగ్స్ లో ఒకటి ఫస్ట్ టైం ఓటర్ దేనని చెబుతున్నారు. ఇందుకోసం టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికుడు తన ఓటరు కార్డునుకూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఓటేయండి.. రెస్టారెంట్ కు వచ్చి తినేయండి ఓటేసిన తర్వాత ఇంటికి వెళ్లి వండుకోవటం ఎందుకు? తమ వద్దకు వచ్చి లంచ్ చేయాలంటూ పలు రెస్టారెంట్లు ఆఫర్లు ప్రకటించాయి. హైదరాబాద్ మహానగరంలోని పలు రెస్టారెంట్లలో యాభై శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ తరహా రెస్టారరెంట్లలో అంతేరా కిచెన్ అండ్ బార్.. పాపాయ.. ఎయిర్ లైవ్.. నోవెటెల్.. లీ మెరిడియన్.. రెడ్ రైనో..కాఫీ కప్ లాంటివి ఉన్నాయి. అంతేకాదు.. ఓటు వేసే ఓటర్ల కోసం స్విగ్వీ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. రెస్టారెంట్లకు వెళ్లే వారు తమ చేతి వేలికి ఉన్న సిరా గుర్తును చూపించటం ద్వారా డిస్కౌంట్ ను సొంతం చేసుకోవచ్చు.