తన వారసులుగా రావాలంటే కొడుకులకు గడ్కరీ కీలక సూచన

రాజకీయ నేతలు తమ రాజకీయ వారసులుగా ప్రకటించే విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోరు.

Update: 2024-03-25 05:49 GMT

రాజకీయ నేతలు తమ రాజకీయ వారసులుగా ప్రకటించే విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోరు. తమకంటే ఉన్నత స్థాయికి ఎదిగేందుకు వీలుగా వారి కెరీర్ ను డిజైన్ చేస్తుంటారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూటు కాస్త సపరేటుగా చెప్పాలి. తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆయన తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ రాజకీయాలు.. సమకాలీన పరిస్థితులు.. సాంకేతిక అంశాల గురించి మాట్లాడే ఆయన తాజాగా మాత్రం తన రాజకీయ వారసుల గురించి మాట్లాడారు.

తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని తన కొడుకులు అనుకుంటే ముందుగా వారు కింది స్థాయిలో పని చేయాలన్నారు. అన్నట్లు నితిన్ గడ్కరీకి ఇద్దరు కుమారులు(నిఖిల్ గడ్కరీ, సారంగ్ గడ్కరీ).. ఒక కుమార్తె (కెట్కి గడ్కరీ). తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. తాను ఈసారి ఎన్నికల్లో ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు. తనను ఆదరిస్తున్న వారికి థ్యాంక్స్ చెప్పిన ఆయన.. తాను చేసిన డెవలప్ మెంట్ యాక్టివిటీస్ గురించి చెప్పుకొచ్చారు.

నాగపూర్ ను.. నాగపూర్ ప్రజల్ని తాను ఎప్పటికి మర్చిపోలేనన్న నితిన్ గడ్కరీ.. తన వారసత్వాన్ని కొనసాగించేందుకు బీజేపీకి చెందిన ఏ కార్యకర్త అయినా ఫర్లేదన్నారు. వారికి ఆ హక్కు ఉందన్న ఆయన.. ‘‘నా కుమారులు ఎవరూ రాజకీయాల్లో లేరు. ఒకవేళ వారు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముందు కింది స్థాయిలో పోస్టర్లు అంటించాలి. పార్టీ బలోపేతం కోసం కార్యకర్త చేసే పన్నులన్నీ చేసి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే నా వారసత్వాన్ని అందుకోవాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

నితిన్ గడ్కరీ ఇద్దరు కుమారులు.. కుమార్తె ముగ్గురు కూడా రాజకీయాలకు దూరంగా వ్యాపారాల్లో మునిగి తేలుతుంటారు. వారు.. ఒక పట్టాన తమ తండ్రి రాజకీయ వాసనలు తమకు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాకుంటే ఆయన రాజకీయ పలుకుబడికి తగ్గట్లు.. వారికి కొన్ని కాంటాక్టులను సొంతం చేసుకున్నట్లుగా చెబుతుంటారు. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి విమర్శలు.. ఆరోపణలు లేవనే చెప్పాలి. ఇక.. నితిన్ గడ్కర విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఆయన మీద పెద్దగా రిమార్కులు లేవనే చెప్పాలి.

కేంద్ర రవాణా, రహదారి శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న నితిన్ గడ్కరీ.. మోడీ సర్కారులో కీలకమైన మంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాము మూడో సారి అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేసే ఆయన.. తమ ప్భుత్వం ఏర్పడిన తర్వాత నాగపూర్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల స్థాయికి తీసుకెళతానంటూ హామీ ఇస్తున్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర విషయానికి వస్తే బీజేపీ.. శివసేన.. ఎన్సీపీ చీలిక వర్గంతో జత కట్టి.. వారితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసింద. దీని ఫలితం ఎలా ఉంటుందో రానున్న రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News