తీగ లాగిన నితీష్.. బాబు డొంక కదిలిస్తారా?
2000 సంవత్సరంలో ఉమ్మడి బిహార్ విడిపోయింది. అప్పట్లో వాజపేయి ప్రభుత్వం బిహార్ విభజన చేసింది.
కేంద్రంలోని ప్రధాని మోడీ కూటమి సర్కారులో భాగస్వామ్య పార్టీగా ఉన్న బిహార్ అధికార పార్టీ జేడీయూ(జనతాదళ్ యునైటె డ్) అధినేత, సీఎం నితీష్ కుమార్.. చేసిన సంచలన తీర్మానం.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఇదేసమయంలో ఏపీ సీఎం.. ఇక్కడి కూటమి నేత చంద్రబాబుకు కూడా.. సెగ పెడుతోంది. 2005 సంవత్సరం నుంచి బిహార్ ప్రజలు.. ప్రబుత్వం.. కూడా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి బిహార్ విడిపోయింది. అప్పట్లో వాజపేయి ప్రభుత్వం బిహార్ విభజన చేసింది.
తద్వారా.. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ క్రమంలో ఉమ్మడి బిహార్‌లో ఉన్న గనులు, భూగర్భ వనరులు, అటవీ సంపద అంతా కూడా.. ఈ రాష్ట్రానికి దఖలు పడింది. దీంతో బిహార్ అప్పటి నుంచి కూడా.. ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతోంది. కానీ, ఎప్పటి కప్పుడు.. ఈ హోదా వ్యవహారం మరుగున పడుతూనే ఉంది. గతంలోనూ బిహార్ సీఎం నితీష్ కుమార్.. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటే.. ముఖ్యమంత్రి స్థానాన్ని ఏ పార్టీకైనా ఇచ్చేందుకు తాను రెడీ అంటూ.. సంచలన ప్రకటన చేశారు. కానీ, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎవరూ పట్టించుకోలేదు. రోజులు గడిచాయి. ఇప్పుడు మోడీ సర్కారుకు నితీష్ కుమార్ 12 మంది ఎంపీలతో మద్దతు ఇస్తున్నారు.
ఒకరకంగా.. మోడీ సర్కారును నితీష్ కూడా నిలబెట్టారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏర్పడి పట్టుమని నెల రోజులు కూడా కాని పరిస్థితిలో నితీష్ సర్కారు సంచలన తీర్మానం చేసింది. తాజాగా అసెంబ్లీలో నితీష్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ.. తీర్మానం చేసింది. దీనిని రేపో మాపో.. గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి.. తద్వారా కేంద్రానికి పంపించనున్నారు. ఇదొక సంచలన నిర్ణయమనే చెప్పాలి. కేంద్రంలోని మోడీ సర్కారు సుదీర్ఘ మౌనం వహించడం.. ఇప్పుడు పూర్తిస్తాయి మెజారిటీ లేకపోయిన దరిమిలా.. నితీష్ వంటి.. కప్పల తక్కెడ నాయకుడిని నమ్ముకున్న సమయంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
అయితే.. స్టోరీ ఇప్పుడు బిహార్ నుంచి ఏపీకి చేరింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై నిత్య యుద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. చంద్రబాబుకు సెగ పెడుతోంది. తాజాగా కాంగ్రెస్ జాతీయస్థాయి నాయకులు.. శశిథరూర్ సహా.. మరికొందరు.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. బిహార్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఉటంకిస్తూ.. ఏపీకి కూడా.. గతంలో మోడీ తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ.. చంద్రబాబుకు స్పందించాలని ఉందా? లేదా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. స్పందించేందుకు.. హోదా రాబట్టుకునేందుకు కూడా.. ఇదే మంచి తరుణమని వ్యాఖ్యానించారు. రెండు రోజుల కిందట.. కూడా.. మల్లికార్జున ఖర్గే ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తానికి బిహార్ సీఎం తీగలాగారు.. కానీ, చంద్రబాబు డొంక కదిలించడం.. అంత ఈజీనేనా? అనేది ప్రశ్న. చూడాలి ఏం జరుగుతుందో.