సుజనా...రమేష్ పోటీకి బాబు మోకాలడ్డు...!?
సుజనా చౌదరి అయితే విజయవాడ నుంచి ఎంపీగానూ సీఎం రమేష్ విశాఖ నుంచి ఎంపీగానూ పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఇది చిత్రంగానే ఉంది. మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ఇద్దరినీ చెరి రెండు సార్లూ రాజ్యసభకు పంపించిన అభిమానం చంద్రబాబుది. 2019లో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఈ ఇద్దరూ టీడీపీని వదిలిపెట్టి బీజేపీలో చేరారు. అదంతా చంద్రబాబు ప్లాన్ లో భాగమే అని ప్రచారంలో ఉంది.
బీజేపీలో ఉన్నా టీడీపీని చంద్రబాబుని ఒక్క మాట కూడా అనని ఎంపీలుగా ఈ ఇద్దరూ ఉన్నారు. ఇపుడు ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఇద్దరూ రాజ్యసభ సభ్యత్వాలు పూర్తి అయ్యాయి. దాంతో లోక్ సభకు పోటీ చేసి మరోసారి పార్లమెంట్ మెట్లు ఎక్కాలని ఈ ఇద్దరూ చూస్తున్నారు.
ఈ నేపధ్యంలో బీజేపీ కోటాలో టీడీపీతో పొత్తులో భాగంగా టికెట్ ని దక్కించుకుంటే రెండు పార్టీల దన్నుతో గెలిచి రావచ్చు అన్నది వారి ఆలోచన. ఇక బీజేపీ కూడా ఈ ఇద్దరూ బిగ్ షాట్స్ కాబట్టి వారికి ఎంపీ టికెట్లు ఇవ్వాలని టీడీపీ ముందు ప్రతిపాదన పెట్టింది అని అంటున్నారు. అయితే తమాషాగా చంద్రబాబు ఈ ఇద్దరికీ టికెట్లు ఇవ్వలేమని తేల్చేశారు అని ప్రచారం అయితే సాగుతోంది.
ఈ ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేరు అన్న దాన్ని టీడీపీ అధినాయకత్వం బీజేపీ పెద్దలతో చెప్పిందట. సుజనా చౌదరి అయితే విజయవాడ నుంచి ఎంపీగానూ సీఎం రమేష్ విశాఖ నుంచి ఎంపీగానూ పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిణామంతో వారిద్దరికీ బాబు షాక్ ఇచ్చారని అంటున్నారు.
దీనికి మరో కారణం ఉందని అంటున్నారు. టీడీపీలో మరో శక్తి కేంద్రం అయిన నారా లోకేష్ ఈ ఇద్దరికీ టికెట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరు అని అంటున్నారు. దాంతో కూడా బాబు ఏమీ చేయలేని స్థితి అంటున్నారు. దానికి బదులుగా ఈ ఇద్దరి సేవలను ఈ ఎన్నికల్లో ఉపయోగించుకుని వారికి టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాజ్యసభ మెంబర్స్ గా తిరిగి పంపేందుకు బాబు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మరో రాజ్య సభ మెంబర్ జీవీఎల్ నరసింహారావుకు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా బీజేపీ టీడీపీ వద్ద ప్రపోజల్ పెట్టిందని అంటున్నారు. జీవీఎల్ గత మూడేళ్ళుగా విశాఖను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్నారు. ఆయనకు బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఉంది.
అయితే దీనికి కూడా టీడీపీ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. విశాఖ సీటు వదులుకోమని స్పష్టం చేసిందని అంటున్నారు. విశాఖ నుంచి ఎంపీగా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ కే టికెట్ ని ఖరారు చేస్తున్నట్లుగా బాబు బీజేపీ పెద్దలకు చెప్పారని అంటున్నారు. మొత్తానికి ముగ్గురు రాజ్యసభ సభ్యులకూ నో టికెట్ అని బాబు చెప్పడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. ఇదే ఇపుడు ప్రచారంగా సాగుతోంది.