గండిపేట.. ఓ ఆశ్రమం.. అన్న ఎన్టీఆర్ కాలంలో టీడీపీ గుండెకాయ..

హైదరాబాబాద్ నగర బాదర బందీలకు దూరంగా అది ఆయన కలల నివాసం అన్నమాట.

Update: 2024-08-29 07:44 GMT

ఇప్పడంటే.. అందరూ గండిపేట గురించి మాట్లాడుకుంటున్నారు.. హైడ్రా కూల్చివేతలతో ఈ ప్రాంతం గురించి చెప్పుకొంటున్నారు.. హిమాయత్ సాగర్ గురించి ఆరా తీస్తున్నారు.. కానీ, 50 ఏళ్ల కిందటే గండిపేటను గుర్తించారు.. మహా నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు. రాజకీయాల్లోకి రాకముందే.. గండిపేటలో ఆశ్రమం నిర్మించుకున్నారు ఎన్టీఆర్. హైదరాబాబాద్ నగర బాదర బందీలకు దూరంగా అది ఆయన కలల నివాసం అన్నమాట.

అప్పట్లోనే ఫాం హౌజ్

హైదరాబాద్ లోని ప్రముఖులు ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణం కోసం శివార్లలో ఫాంహౌజ్ లు కట్టుకుంటున్నారు దీంతో ఫాంహౌజ్ అనే మాట ఇప్పుడు సాధారణమైంది కానీ.. 50 ఏళ్ల కిందటే కనీసం బయటివారు ఎవరూ వెళ్లని గండిపేటలో ఎన్టీఆర్ కుటీరం (ఫౌంహౌజ్ అనే పేరుకు తెలుగులో సరైన అర్థం) నిర్మించుకున్నారు. పూర్తి పల్లె వాతావరణంలో సమీపంలోనే గండిపేట చెరువు ఉండగా సినిమాలు లేనప్పుడు వచ్చి సేద దీరేందుకు దీనిని కట్టుకున్నారు. అంతే అపురూపంగా చూసుకునేవారు.

టీడీపీకి పుట్టిల్లు..

తెలుగుదేశం పార్టీకి పుట్టిల్లు ఏదంటే.. గండిపేట కుటీరం అనే చెప్పాలి. 1983 ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్.. తన పార్టీ ఎమ్మెల్యేలకు గండిపేట కుటీరంలోనే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. అప్పట్లో నగరానికి చాలా దూరంలో ఉండే గండిపేటకు వెళ్లడం సొంత వాహనాలు లేని వారికి పెద్ద కష్టమే అయ్యేది. కానీ, ఎన్టీఆర్ ను కాదని చెప్పేదెవరు? కాగా.. నాదెండ్ల భాస్కరరావు కుట్ర సమయంలో పార్టీ ఎమ్మెల్యేలను గండిపేటకే తరలించారు. అక్కడే శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ పార్టీ పండుగ మహానాడును గండిపేటలోనే నిర్వహించారు.

ఎన్టీఆర్ భవన్ తో తెరమరుగు

మొదట్లో హిమాయత్ నగర్ పార్టీ కార్యాలయం తర్వాత గండిపేట టీడీపీకి అత్యంత కీలకంగా ఉంది. అయితే, చంద్రబాబు హయాం మొదలవడం, ఎన్టీఆర్ మరణం, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుతో గండిపేట ఆశ్రమం ప్రాధాన్యం తగ్గింది. కానీ, చారిత్రకంగా చూస్తే అన్న ఎన్టీఆర్ ఎంచుకున్న గండిపేట తెలుగుదేశం గుండెకాయ అనే చెప్పాలి. ఇక ఇప్పటి విషయానికి వస్తే.. గండిపేట చెరువు ఎఫ్టీఎల్ లో చాలామంది ప్రముఖులు ఎకరాలకు ఎకరాలు ఆక్రమించి విలాసవంతమై భవనాలు నిర్మించడం గమనార్హం.

Tags:    

Similar News