యూపీ వాసులకు బిగ్ రిలీఫ్.. మరో తోడేలు దొరికేసిందోచ్..!

గత కొన్ని నెలలుగా ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లా ప్రజలు కంటి మీద కునుడు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు.

Update: 2024-09-14 06:47 GMT

గత కొన్ని నెలలుగా ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లా ప్రజలు కంటి మీద కునుడు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. నిద్రాహారాలు మాని ప్రాణాలు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. తమ బిడ్డలను రక్షించుకునేందుకు పడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదు. వారిని భేడియాలు అంతలా భయపెట్టాయి మరి. వారిని అంతటా భయపెట్టిన ఆ భేడియాలా కథేంటి..? ఈ ఆపరేషన్ భేడియా స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం.

ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ వాసులపై భేడియాలు (తోడేళ్లు) దాడికి పాల్పడుతున్నాయి. మహాసి తహసీల్‌లో అడవి నుంచి వస్తున్న తోడేళ్ల గుంపు ఒక్కసారిగా ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ తంతు కొనసాగుతోంది. వాటి దాడిలో 10 మంది వరకు చనిపోయారు. వారిలో 9 మంది చిన్నపిల్లలు ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇంకా డజన్ల కొద్ది జనాలు గాయపడ్డారు. వీటివల్ల 35 గ్రామాలు వణికిపోతున్నాయి. అయితే.. తోడేళ్ల గుంపును పట్టుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటవీ సంరక్షణ అధికారులు, పోలీసులతో కలిసి ‘ఆపరేషన్ భేడియా’ చేపట్టింది. అవి కనిపిస్తే అవసరమైతే కాల్చిపడేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.

అయితే.. తోడేళ్లను పట్టుకునేందుకు ఆపరేషన్ భేడియాలో భాగంగా అక్కడి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేసింది. తోడేళ్ల గుంపు ఎంతసేపూ చిన్నారులనే టార్గెట్ చేస్తుండడంతో కొత్తగా ఆలోచించింది. తోడేళ్ల సంచారం ఉన్న చోట రంగురంగుల బొమ్మలను ఏర్పాటు చేయించింది. వాటికి చిన్నారుల దుస్తులను వేసి.. ఆ దుస్తులను పిల్లల మూత్రంగా తడిపేసి తొడిగారు. వాటిని ప్రధానంగా తోడేళ్ల గుంపు ఉండే గుహలు, నదీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అలా.. చాలా వరకు ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. మొత్తంగా 6 తోడేళ్లు ఉన్నాయని గుర్తించిన అధికారులు ఇప్పటికే నాలుగు పట్టుకున్నారు. ఆ రెండు తోడేళ్లు మాత్రం అధికారుల కంటికి కనిపించకుండా తిరుగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. బహ్రెయిచ్ జిల్లాలోని హరబక్స్ పూర్వ గ్రామంలోని ఘఘర నది సమీపంలో ఐదో తోడేలును కూడా బంధించినట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఇంతకుముందు వాటిని కూడా ఇదే ప్రాంతంలో బంధించినట్లు చెప్పుకొచ్చారు. ఇంకా ఒక తోడేలును పట్టుకోవాల్సి ఉందని, ప్రజలు అప్పటివరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా దానిని కూడా పట్టుకుంటామని భరోసా ఇచ్చారు. సాధారణంగా తోడేళ్లు మనుషులపై దాడులకు పాల్పడవు. కానీ.. ఇక్కడ మాత్రం ఏకంగా మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. దాంతో జంతు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News