దేశం వదిలి వెళ్లిపోండి... 17 లక్షల మందికి పాక్ ఆర్డర్
దేశంలోని ఆర్థిక, అంతర్గత సమస్యలతో ఇటీవలి కాలంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
దేశంలోని ఆర్థిక, అంతర్గత సమస్యలతో ఇటీవలి కాలంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తమ దేశం వదిలి వెళ్లిపోవాలంటూ ఏకంగా 17 లక్షల మందికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్డర్ వేసింది. వీరంతా పాక్ పొరుగుదేశమైన అప్ఘనిస్తాన్‌కు చెందిన వారు. దీనికి కారణం పాకిస్తాన్‌లో అప్ఘన్ పౌరులు చేపడుతున్న ఉగ్రవాద చర్యలు కావడం గమనార్హం.
తాలిబాన్‌లు 2021లో అప్ఘాన్ పాలనపగ్గాలు చేజిక్కించుకున్న తర్వాత అక్కడి ప్రజల్లో కొందరు పొరుగున ఉన్న పాకిస్తాన్ విచ్చేశారు. వీరి సంఖ్య దాదాపు 21 లక్షలు ఉంటుందని అంచనా. దాదాపు 13 లక్షల మంది శరణార్థులుగా తమ వివరాలు ఐక్యరాజ్యసమితి వద్ద నమోదు చేసుకోగా... మరో 8.8లక్షల మంది శరణార్థులుగా పాక్‌లో నివాసం ఉన్నారు. ఇక అనధికారికంగా మరో 17లక్షల మంది పాకిస్తాన్‌లో ఉన్నట్లు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్ బుగిటి ఇటీవల ప్రకటించారు. మొత్తంగా వీరందరినీ వదిలించుకునేందుకు పాక్ సన్నద్ధం అవుతోంది. వచ్చే నవంబర్ 1వ తేదీ నాటికి శరణార్థులు దేశం విడిచిపోవాలని పేర్కొంటూ ఒకవేళ సహకరించకపోతే భద్రతా బలగాల సహాయంతో వారిని బయటకు పంపించేస్తామని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి హెచ్చరించారు. ఒకవేళ పాక్ గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ జాతీయతను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేస్తామని పాక్ మంత్రి ప్రకటించడాన్ని బట్టి సమస్యను వారు ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
పాకిస్తాన్ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకునేందుకు ఇటీవలి ఘటనలు కారణమని ఆ దేశ మీడియా చెప్తోంది. ఇటీవల పాక్ సరిహద్దులోని మాస్తాంగ్ లో గల ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 50 మంది పాక్ పౌరులు కన్నుమూశారు. మరోవైపు బలూచిస్థాన్ ప్రావిన్సులో పాకిస్థానీ తాలిబాన్ (టీటీపీ), ఇస్లామిక్ స్టేట్ గ్రూపు మధ్య ఘర్షణ కొనసాగుతోంది. పాక్ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జరిగిన 24 ఆత్మాహుతి దాడులలో 14 దాడుల్లో అఫ్గాన్ పౌరులే ఉన్నారని పాక్ నిర్ధారించింది. దీంతో అప్ఘన్ పౌరుల సహకారంతో ఆ దేశ ఉగ్ర సంస్థలే పాక్‌లోకి చొరబడి దాడులు చేస్తున్నాయంటూ ఆ దేశ ప్రభుత్వం ఫైరవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టడంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకుంది.