బడ్జెట్ లో సింహ భాగం నిధులు పవన్ కే !
పంచాయతీరాజ్ శాఖలో పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఆలోచిస్తున్న తీరుని పయ్యావుల పొగిడారు.
ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఏమిటి అన్నది మరోసారి తెలిసి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలకంగా ఉన్నారు. ఆయనకు చంద్రబాబుతో సరిసమానంగా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా చంద్రబాబుతో పాటు పవన్ ని కూడా ప్రశంసించారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఆలోచిస్తున్న తీరుని పయ్యావుల పొగిడారు.
చంద్రబాబు పవన్ ల సారధ్యంలో కూటమి ప్రభుత్వం ప్రగతి బాటన నడుస్తోంది అని కూడా పయ్యావుల చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖకు గతంలో కంటే కూడా ఎక్కువ నిధులు వచ్చాయి. అంతే కాదు ఏ ఇతర మంత్రిత్వ శాఖలకు రానన్ని నిధులు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే సింహభాగం నిధులు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు దక్కడం అంటే పవన్ కి కూటమి ప్రభుత్వంలో దక్కిన ప్రాధాన్యత అని అంటున్నారు
మొత్తం రెండు లక్షల 94 వేల కోట్ల భారీ బడ్జెట్ లో పంచాయతీ రాజ్ శాఖకు కేటాయించినది 16 వేల 739 కోట్ల రూపాయలు. ఇతర మంత్రిత్వ శాఖల కంటే ఇదే ఎక్కువ మొత్తంగా చెబుతున్నారు. ఈ బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు. దీని వల్ల పవన్ గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలన్న తన ఆలోచనలను అమలు చేయడానికి పూర్తి స్థాయిలో సాధ్యపడుతుందని అంటున్నారు.
రాష్ట్రంలోని అన్ని పల్లెలలో వెలుగులు నింపుతామని పవన్ తరచూ చెప్పే మాటలను ఇపుడు చేతల రూపంలో చూపించే చాన్స్ వచ్చినట్లే అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అంతా నమ్ముతారు. ఆ విధంగా పవన్ కీలకమైన పాత్ర పోషించినందుకు గానూ ఇపుడు కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఘనమైన మర్యాదలే దక్కుతున్నాయని అంటున్నారు.
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ విషయంలో తన గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి బాబు ఇస్తున్న విలువకు తొలి బడ్జెట్ లోనే ఆయన శాఖలకు కేటాయించిన మొత్తాలే నిదర్శనం అని అంటున్నారు.
మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉన్న అటవీ పర్యావరణ శాఖలకు కూడా గతాని కంటే భిన్నంగా 687 కోట్ల రూపాయల నిధులను తొలి బడ్జెట్ లో కేటాయించారు. ఇక గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయలు కేటాయిస్తే పట్టణాభివృద్ధి శాఖకు 11 వేల 490 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే గ్రామాల పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది అనడానికి ఒక సంకేతం అని అంటున్నారు
అదే సమయంలో బీసీ వెల్ఫేర్ కి 3,907 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మైనారిటీ వెల్ఫేర్ కి 4, 376 కోట్ల రూపాయలు, ఎస్టీ వెల్ఫేర్ కి 7,557 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కి 1,215 కోట్ల రూపాయలు కేటాయించారు. గృహ నిర్మాణానికి 4, 012 కోట్ల రూపాయలు కేటాయించారు. పోలీస్ శాఖకు 9,495 కోట్ల రూపాయలు, ఇంధన శాఖకు 8,207 కోట్ల రూపాయలు కేటాయించారు.
మొత్తం మీద చూసుకుంటే అన్ని మంత్రిత్వ శాఖల కంటే అత్యధిక వాటా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు దక్కడం అంటే పవన్ కళ్యాణ్ కి ఇస్తున్న ప్రయారిటీ అని మరోసారి అంతా గట్టిగా చెబుతున్న మాటగా ఉంది.