హోం మంత్రిని అవుతా....పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చిన పవన్!
ఏపీలో మహిళల మీద వరసగా జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు.
ఏపీలో మహిళల మీద వరసగా జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అసలు ఏమి జరుగుతోంది అని ఆయన నేరుగా హోం శాఖనే ప్రశ్నించారు. డీజీపీ ఐజీ ఏమి చేస్తున్నారు అని ఆయన నిలదీశారు
తప్పు చేసిన వారిని అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు అని ఆయన పోలీసులను నిలదీశారు. మీరు ఐపీఎస్ చదవలేదా ఎందుకు మీ ఉద్యోగ ధర్మం మరుస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అని ఆయన స్పష్టం చేశారు. ఫలనా వారి బంధువు అని ఎవరైనా చెబితే గట్టిగా మడతేయండి అని ఆదేశించారు.
ఏపీలో లా అండ్ ఆర్డర్ తీరు మీద ఆయన తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు అని పవన్ అనడం విశేషం. నేను పంచాయత్ రాజ్, అటవీ శాఖ పర్యావరణం వంటి శాఖలు చూస్తున్నాను అని ఆయన అన్నారు. నేను హోం శాఖ తీసుకోలేదు. అయినా జనాలు అడుగుతున్నారు. మరి ఆ శాఖకు బాధ్యత వహించిన వారు సమీక్షలు చేయాల్సిన అవసరం లేదా అని పవన్ ప్రశ్నించారు ఏపీలో జరుగుతున్న వాటికి హోం మంత్రి అనిత బాధ్యత వహించి సమీక్ష చేయాలని ఆయన సూచించారు.
పరిస్థితి ఈ విధంగా కొనసాగితే నేను హోం మంత్రిని అవుతాను అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనే కనుక ఆ శాఖకు వస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని కూడా హెచ్చరించారు. హోం శాఖ నేను తీసుకోలేకనా లేక అడగలేకనా అని ఆయన అన్నారు. ఆయా స్థానాలలో ఉన్న వారు బాధ్యతగా ఉండాలని పవన్ సూచించారు.
ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ చేసిన తరహాలో గట్టి చర్యలు ఏపీలో తీసుకోవాలని కోరారు. తప్పు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. చట్టం పదునుగా ఉండాలని పవన్ కోరారు. అదే సమయంలో తనకు పదవులు ఏవీ ముఖ్యం కావని ఐ డోంట్ కేర్ అని అన్నారు. అయినా తాను ప్రజల కోసం మహిళల కోసం ఆలోచిస్తున్నాను అని ఆయన చెప్పడం విశేషం. గత వైసీపీ ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయితే పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఆ ప్రభుత్వం లాగానే ఇపుడు కూడా ఉండాలా అని ఆయన అన్నారు.
పోలీసులు పాత పద్ధతులు మార్చుకోవాలని ఆయన అంటూ ఇదే మీకు చివరి హెచ్చరిక అని కూడా అన్నారు. మొత్తానికి చూస్తే పవన్ చాలా కాలానికి గట్టిగానే రియాక్ట్ అయ్యారని అంటున్నారు. హోం మంత్రి అనిత కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన కోరడం కూడా గమనార్హం అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరుగా వరస సంఘటనలు ఉంటున్నాయి, దాంతో పవన్ తన మనసులో మాటను బయట పెట్టారు. తనకు అప్పగించిన శాఖలను ఆయన జనం ముందు పెడుతూ ఆ శాఖల విషయంలో తాను నిబద్ధతతో ఉండగలిగినట్లుగా చెప్పదలచారు. అయితే ఇతర శాఖలకు చూస్తున్న వారు కూడా ఉండాలి అన్నదే ఆయన విధానం.
ఇక తప్పు చేసిన వారి విషయంలో బంధుత్వాలు కులాలు ఏవీ అడ్డు కాకూడదని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిందే అని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా పవన్ ఒక్కసారి మాట్లాడిన ఈ మాటలు కూటమికి ఒకింత షాక్ గానే ఉన్నా విపక్షాల కంటే కూడా పదునైన తీరులో ఆయన మాట్లాడారు అని అంటున్నారు.
మరో వైపు హోం మంత్రిగా తాను బాధ్యత తీసుకుంటాను అని పవన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మాత్రం ఎపీలో పొలిటికల్ గా వైరల్ అవుతోంది. పవన్ హోం మంత్రి అయితే అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి పవన్ హోం మంత్రి అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన తనకు ఎంతో ఇష్టమైన పచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నారు.
కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఇపుడు అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలలో నిజాయితీ నిబద్ధత మాత్రమే ఉంది తప్ప రాజకీయం లేదని అంతా అంటున్నారు. సగటు జనాలకు కూడా ఇదే మేసేజ్ కన్వే అవుతోంది. మరి దానిని రైట్ యాంగిల్ లో చూసి హోం మంత్రిత్వ శాఖ తగిన విధంగా రియాక్ట్ అయితే కూటమి ప్రభుత్వానికే మేలు అని అంటున్నారు.