రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ !
పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలు సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్
పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలు సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ అటు టీడీపీ, ఇటు బీజేపీ అధిష్టానం పెద్దల విశ్వాసాన్ని చూరగొన్నాడు. ముఖ్యంగా ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కోసం పవన్ కళ్యాణ్ తన పార్టీ సీట్లను తగ్గించుకోవడం, ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను ఈ కూటమి 21 స్థానాలు గెలుచుకోవడం,కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడడానికి ఇవి కీలకం కావడమే పవన్ కళ్యాణ్ పరపతి పెరిగేలా చేసింది.
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ఐదేళ్లలో తన మార్కు పాలన చూయించాలన్న భావనతో ప్రత్యేకంగా కేంద్రాన్ని కోరి తన ఓఎస్డీగా కేరళలో కలెక్టర్ గా పనిచేస్తున్న యువ ఐఎఎస్ కృష్ణతేజను తన పేషీలోకి తీసుకోవడంతోనే పవన్ కళ్యాణ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ఇటీవల జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డును అందుకున్నాడు. బాలల హక్కుల రక్షణలో ఆయన కలెక్టర్ గా పనిచేసిన త్రిసూర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కేరళలో వరదలు ముంచెత్తిన సమయంలో అలెప్పీ సబ్ కలెక్టర్ గా ఆయన పనితీరు జాతీయస్థాయిని ఆకర్షించింది.
ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ స్థానం నుండి 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. తనకు భారీ విజయం ఇచ్చిన పిఠాపురం అభివృద్ధిలో భాగంగా పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరు మీద పవన్ కళ్యాణ్ సర్వే చేయించడం, సమీక్షలు నిర్వహించడం ద్వారా సరికొత్త ట్రెండ్ కు నాందీ పలికారు. ఈ సంధర్భంగా వచ్చినే నివేదికలు చూసి సిబ్బంది పనితీరు మీద పవన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
పిఠాపురంలో వరస సమీక్షలు చేస్తూ అధికారులను పవన్ పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేపట్టే కార్యక్రమాన్ని నెలకు రెండు సార్లు పిఠాపురంలోనే నిర్వహిస్తుండడం విశేషం. అంతే కాదు ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం నుండే మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నాడు. మొత్తానికి సినిమాల్లో మాదిరే తన మార్కు పాలనతో పవన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.