కర్ణాటక సీఎంతో పవన్ కల్యాణ్... ఏమిటీ కుమ్కీ ఏనుగులు?
ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఈ సమయంలో కుమ్కీ ఏనుగుల టాపిక్ తెరపైకి వచ్చింది.
అవును... పవన్ కల్యాణ్ నేడు బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర పర్యావరణ, అటవీ మంత్రి ఈశ్వర్ బీ.ఖంద్రేతో భేటీ కానున్నారు. ఈ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఓ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం ఆయనతో పవన్ కల్యాణ్ చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి ఉమ్మడి చిత్తురు, పార్వతీపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్న సంఘటనల సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇవి ప్రజలకు ప్రాణ హాని కలిగిస్తుంటాయి. ఈ సమయంలో.. అలాంటి ఏనుగులను అడవుల్లోకి తరిమేందుకు అటవీ శాఖ ప్రయత్నించినా.. పూర్తి సత్ఫలితాలు రాని పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కుమ్కీ ఏనుగులు అవసరమని అధికారులు పవన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఏనుగులు కర్ణాటకలో ఉన్నట్లు తెలుసుకున్న పవన్.. వాటిలో కొన్ని ఏపీకి ఇచ్చేలా మాట్లాడేందుకు బెంగళూరు వెళ్లి.. అటవీ శాఖా మంత్రితో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
ఏమిటీ కుమ్కీ ఏనుగులు!?:
భారతదేశంలో శిక్షణ పొందిన ఏనుగులకు ఉపయోగించే పదమే కుమ్కీ. అడవి ఏనుగులను ట్రాప్ చేయడానికి.. చిక్కుకున్న లేదా గాయపడిన అడవి ఏనుగులను రక్షించడానికి వీటిని వాడతారు. ఇదే సమయంలో... అడవి ఏనుగులను బంధించడానికీ, శాంతింప చేయడానికీ ఉపయోగిస్తారు. ఇదే క్రమంలో... అడవి ఏనుగులు మానవ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పుడు వాటిని తరిమి కొట్టడానికీ ఈ కుమ్కీలను వాడతారు!