ఓపెన్ చేయలేదన్న తర్వాత రెడ్ బుక్ కెలుకుడు అవసరమా పేర్ని?

ఇదిలా ఉంటే.. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రెడ్ బుక్ మీద పలు కామెంట్లు చేశారు.

Update: 2024-08-07 05:17 GMT

ఒకటికి రెండుసార్లు కాదు.. ఐదారుసార్లకు పైనే ఏపీ మంత్రి నారా లోకేశ్ క్లారిటీగా చెబుతున్న మాట.. రెడ్ బుక్ ను ఇంకా తెరవలేదని. ఇప్పుడే ఇలా ఉన్నారు.. తెరవని రెడ్ బుక్ ను తెరిస్తే ఇంకేం అవుతారంటూ ఎద్దేవా చేయటం తెలిసిందే. ఏపీలో లోకేశ్ రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న వైసీపీ ప్రచారంపై ఈ మధ్యనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు లోకేశ్. తాను ఇంత వరకు రెడ్ బుక్ తెరిచిందే లేదన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రెడ్ బుక్ మీద పలు కామెంట్లు చేశారు. ఏపీలో గడిచిన రెండు నెలలుగా అంబేడ్కర్ రాజ్యాంగం బదులు నారా లోకేశ్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. శాంతిభద్రతల్ని కాపాడే అంశంలో పోలీసులను కొత్త పోకడలతో నడిపించే పరిస్థితి కనిపిస్తుందన్న ఆయన.. గతంలో ఎప్పుడూ లేని పోకడలు గడిచిన రెండునెలలుగా రాష్ట్రంలో చూస్తున్నట్లు పేర్కొన్నారు.

గతంలో ఉత్తరప్రదేశ్.. బిహార్ లలో ప్రభుత్వ ప్రేరేపిత హింసను చూశామని.. ఇప్పుడా పరిస్థితి ఏపీలో నెలకొందన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతుందన్న ఆయన.. చివరకు పోలీసులపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నోరు విప్పటం లేదని మండిపడ్డారు. నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న దారుణ హత్యను తీవ్రంగా తప్పు పట్టిన పేర్ని నాని.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఒక రిటైర్డు డీజీపీ.. రిటైర్డు ఐజీలు ఇద్దరు కలిసి అమలు చేస్తున్నారన్నారు.

తాజాగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు.. ఎస్పీల భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీల గురించి ప్రస్తావించలేదని.. రాజకీయ పార్టీ తరహాలో ప్రభుత్వాన్నినడుపుతామన్నట్లువ్యవహరించారన్నారు. జగన్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా.. అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేయాలని చెప్పే వారన్న పేర్నినాని మాటలు చూస్తే.. పదే పదే రెడ్ బుక్ ప్రస్తావన కూటమి ప్రభుత్వానికి చిరాకు పుట్టేలా చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

ఓవైపు తాము రెడ్ బుక్ ఓపెన్ చేయలేదని క్లారిటీ ఇచ్చిన తర్వాత.. ఇలా కెలకాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. మొన్నటివరకు నలబై రోజుల్లో 36హత్యలు జరిగినట్లుగా మాట్లాడారని.. ఆ వివరాలు ఇవ్వాలని కోరిన తర్వాత నుంచి ఆ మాట మాట్లాడటం మానేశారని.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎప్పటికి మానతారంటూ పేర్నిని ప్రశ్నిస్తున్నారు. మరి.. వీటికి పేర్ని ఎప్పుడు బదులిస్తారో చూడాలి.

Tags:    

Similar News