హైడ్రాను రద్దు చేయాలని పిటిషన్.. హైకోర్టు ఏం చెప్పిందంటే..

ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా అధికారాలను సవాల్ చేస్తూ నానక్‌రామ్ గూడకు చెందిన లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-09-14 09:49 GMT

హైదరాబాద్, నగరం చుట్టుపక్కల ప్రాంతంలోని చెరువుల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు రూపకల్పన చేశారు. ఇందుకు జీవో 99ని తీసుకొచ్చారు. అక్రమ కట్టడాల కూల్చివేత, సర్కార్ ఆస్తుల కాపాడడం హైడ్రా ముందున్న లక్ష్యాలు. జూన్‌లో ఏర్పాటైన హైడ్రా.. అప్పటి నుంచి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న వాటిని, నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగిస్తోంది.

హైడ్రా పనితీరును అందరూ మెచ్చుకుంటూ.. స్వాగతిస్తున్నారు. చాలా వరకు జిల్లాల నుంచి కూడా తమ పరిధిలో ఏర్పాటు చేయాలని కోరారు. అయితే.. కొందరి నుంచి విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పుడు అక్రమ నిర్మాణాలంటూ చెబుతూ హైడ్రా కూల్చివేస్తోందని.. మరి అప్పుడు అధికారులు వాటికి ఎలా అనుమతులు ఇచ్చారంటూ బాధితులు నిలదీస్తున్నారు. అక్రమమే అయినప్పుడు పన్నులు ఎందుకు కట్టించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు అనుమతులు ఇస్తేనే తాము నిర్మాణాలు చేపట్టామని.. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే క్రమంలో హైడ్రాను రద్దు చేయాలంటూ తాజాగా తెలంగాణలో పిటిషన్ దాఖలు కావడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా అధికారాలను సవాల్ చేస్తూ నానక్‌రామ్ గూడకు చెందిన లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ముందస్తు సమాచారం లేకుండా.. ఎలాంటి నోటీసులు లేకుండా అమీన్‌పూర్‌ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో సెప్టెంబర్ 3న వ్యవసాయక్షేత్రంలోని షెడ్లు కూల్చివేశారని ధర్మాసనానికి విన్నవించారు. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కట్టడాలను నేలమట్టం చేశారని వెల్లడించారు. దీనిపై హైకోర్టు ఫైర్ అయినట్లుగా తెలిసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. బాధితుల నుంచి వివరణలు తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించింది.

జీహెచ్ఎంసీ అధికారాలను సైతం ప్రభుత్వం హైడ్రాకు అప్పగించిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఇది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమని విన్నవించారు. కాబట్టి హైడ్రాను వెంటనే రద్దు చేయాలని కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News