ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటా....పవన్ బోల్డ్ స్టేట్మెంట్
అంతటి కీలకమైన పదవి వస్తే తప్పకుండా స్వీకరిస్తానని చెప్పారు. ఈ విషయంలో తాను విముఖంగా ఎపుడూ లేనని ఆయన అన్నారు. సీఎం అవడానికి తాను ఎపుడూ సుముఖమనే అని పవన్ తేల్చి చెప్పారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటాను అని ఆయన గట్టిగా చెప్పేశారు. సీఎం పోస్ట్ స్వీకరించే విషయంలో ఎలాంటి మొహమాటాలు లేవు అని కూడా పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి అన్నది ఒక బాధ్యత అన్నారు.
అంతటి కీలకమైన పదవి వస్తే తప్పకుండా స్వీకరిస్తానని చెప్పారు. ఈ విషయంలో తాను విముఖంగా ఎపుడూ లేనని ఆయన అన్నారు. సీఎం అవడానికి తాను ఎపుడూ సుముఖమనే అని పవన్ తేల్చి చెప్పారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలే తనకు ప్రధమ ప్రాధాన్యత అని ఆయన మరో మాటను కూడా చెప్పారు.
తనకు ప్రజలు సీఎం పదవి ఇస్తే కచ్చితంగా స్వీకరిస్తాను ఈ విషయంలో రెండవ మాట అన్నదే ఉండదని పవన్ అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉందని పవన్ మరో మారు చెప్పారు. అదే సమయంలో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా అంతా కలసి పోరాడాలని పార్టీ నేతలకు ఆయన పిలుపు ఇచ్చారు.
ఇక టీడీపీతో పొత్తుల విషయం కూడా పవన్ ప్రస్తావించారు. అందరి అభిప్రాయాలతోనే తాను పొత్తుల మీద నిర్ణయం తీసుకున్నాను తప్ప అది తన సొంత నిర్ణయం కానే కాదని ఆయన అంటున్నారు. పవన్ ఈ విధంగా ప్రకటనలు చేయడం వెనక ఆంతర్యం ఏమిటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఈ నెల 1వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో వారాహి యాత్ర నాలుగవ విడత చేపట్టారు.
అయితే పొత్తుల ప్రకటన టీడీపీతో అని చేసిన తరువాత జరిగిన ఈ యాత్ర అనుకున్న స్థాయిలో సాగలేదు అన్న మాట ఉంది. దాంతో పాటు జనసేనలోని కొందరు కీలక నేతలు వరసగా రాజీనామాలు చేయడం పొత్తుల మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో పవన్ ఇపుడు వాటి మీద గట్టిగా మాట్లాడారు అని అంటున్నారు.
పొత్తుల డెసిషన్ తన ఒక్కరిదే కాదు అని ఆయన అనడం వెనక విషయం కూడా అదే అని అంటున్నారు. అదే విధంగా చూస్తే సీఎం పదవి తీసుకోవడానికి తాను సుముఖం అని పవన్ అంటున్నారు. అయితే అది ప్రజలు తనకు ఇవ్వాలని ఆయన అంటున్నారు. ప్రజలు ఇవ్వాలీ అంటే మొత్తం 175 సీట్లకు పోటీ చేసి తీర్పు కోరాలి.
కానీ జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని పవనే మరో వైపు చెబుతున్నారు. పైగా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధమ ప్రాధాన్యత అని ఆయన అంటున్నారు మొత్తానికి పవన్ చెబుతున్న విషయాలలో ఇంకా కొంత అస్పష్టత ఉందా అన్న చర్చ సాగుతోంది. ఇక టీడీపీతో జనసేన కలిస్తే సీఎం పోస్ట్ ఎలా వస్తుంది అన్నదే కదా జనసైనికుల సందేహం అని అంటున్నారు.
జనసేన టీడీపీ సమానంగా సీట్లు తీసుకుని పోటీ చేస్తాయి. కచితంగా అధికారంలో జనసేనకు రేపటి రోజున వాటా ఉంటుందని పవన్ క్లారిటీగా చెబితే జనసేనలో కొత్త ఉత్సాహం కట్టలు తెంచుకుంటుందని అంటున్నారు. మరి ఆ విధంగా జనసేనకు 75 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ రెడీ అవుతుందా. కనీసం యాభై సీట్లు అయినా ఇస్తుందా అన్నది ఒక కీలకమైన ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా పవన్ మాత్రం పొత్తుల విషయంలో క్యాడర్ కి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగానే ఉంది అని అంటున్నారు.