వరద నీటిలో నడిచిన గర్భిణి..ఈ కష్టం ఎవరికీ రాకూడదు

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలకు విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే.

Update: 2024-09-04 14:07 GMT

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలకు విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. బుడమేరు వాగుకు మూడు చోట్ల గండి పడడంతో సింగ్ నగర్ తో పాటు బుడమేరు పరిసర ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను, ముంపునకు గురైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ గర్భిణిని లోతట్టు ప్రాంతం నుంచి తరలిస్తుండగా...ఆమె వరద నీటితో నడుస్తున్న ఫొటో వైరల్ అయింది.

మోకాళ్ల లోతు వరద నీటిలో నిండు గర్భిణి ఒకరు అతి కష్టంగా అడుగులో అడుగు వేస్తూ వెళుతున్న ఫొటో పలువురిని కలచివేసింది. అత్యంత జాగ్రత్తగా సురక్షిత ప్రాంతంలో ఉండాల్సిన నిండు గర్భిణి..అత్యంత ప్రమాదకర పరిస్థితులలో వరద నీటిలో సురక్షిత ప్రాంతానికి తరలివెళుతున్న దృశ్యాలు పలువురి గుండెలను పిండేశాయి. అయితే, గర్భిణులను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వరద నీటిలో చిక్కుకున్న 154 మంది గర్భిణులను ఆసుపత్రులకు ప్రభుత్వ యంత్రాంగం తరలించింది. మరో పది రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశాలున్నాయన్న గర్భిణులను ఆస్పత్రికి తరలించామని అధికారులు చెబుతున్నారు.

వరద బాధితులతో పాటు గర్బిణులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సీఎం చంద్రబాబు చూపించిన చొరవ, స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి వారికి సాయం అందేలా చూసిన వైనంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. వాంబే కాలనీలో ఓ గర్భిణిని స్వయంగా చంద్రబాబు దగ్గరుండి ట్రాక్టర్ ను పిలిపించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైనం వైరల్ గా మారింది. ఇక, బెజవాడలోని డాబాకొట్ట రోడ్డులో ఓ మహిళ వరద నీటిలో చిక్కుకొని తన ఇంట్లోనే ప్రసవించింది. విషయం తెలుసుకున్న విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో అక్కడకు వెళ్లి ఆమెను ఆసుపత్రికి దగ్గరుండి తరలించారు.

Tags:    

Similar News