30 వేల మెజారిటీతో గెలిచే సీట్లు మూడేనా ?
వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల, రెండవది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, మూడవది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం అని అంటున్నారు.
ఏపీలో ఈసారి ఫైట్ ఎంత టైట్ గా ఉండబోతుందో చెప్పేందుకు అనేక సర్వేలు ఉన్నాయి. అలాగే అనేక అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అటు అధికార వైసీపీ కానీ ఇటు విపక్ష తెలుగుదేశం కూటమి కానీ ఈసారి ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకుంటున్నారు. ఆరు నూరు అయినా ఈసారి గెలవాల్సిందే అని పట్టుబడుతున్నారు.
దాంతో ప్రతీ ఓటూ కీలకంగా మారుతోంది. అలాగే నువ్వా నేనా అన్న పోటీ కూడా సాగుతోంది. ఈ నేపధ్యంలో గతంలో వచ్చిన భారీ మెజారిటీలు ఈసారి రాకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఏకపక్షంగా ఎన్నికలు సాగితేనే భారీ మెజారిటీలు నమోదు అవుతాయి. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు అని రాజకీయ పండితులు అంటున్నారు.
ఈ నేపధ్యంలో ఈసారి భారీ మెజారిటీలు ఎక్కడ వస్తాయి అన్న దాని మీద అపుడే అన్వేషణ మొదలైంది. కనీసంగా పట్టుమని పది సీట్లలో కూడా భారీ మెజారిటీలు వచ్చే సీన్ అయితే ఉండదని అంటున్నారు. దాంతో ఈసారి స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కే నేపధ్యం ఉంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ముప్పయి వేల భారీ మెజారిటీలు ఈసారి చూడగలుగుతామా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇదే 2019లో అయితే ఏకంగా ఇరవై వేల మెజారిటీలు పైబడిన సీట్లు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ముప్పయి వేల మెజారిటీ దాటినవి కూడా పదుల సంఖ్యలోనే సీట్లు ఉన్నాయి. అలాగే లక్ష పై దాటిన మెజారిటీలు వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అయితే తొంబై వేల ఓట్ల మెజారిటీ వచ్చింది.
అదే ఊపులో నలభై వేలు యాభై వేల మెజారిటీలు కూడా టచ్ చేసిన సీట్లు అనేకం కనిపిస్తాయి. ఇవన్నీ వైసీపీ గెలిచిన సీట్లుగానే ఉన్నాయి. ఎందుకంటే భారీ ప్రభంజనం జగన్ కి అనుకూలంగా 2019 ఎన్నికల్లో వీచింది. జగన్ నాయకత్వంలో వైసీపీకి 151 సీట్లు ఆనాడు లభించాయి. అదే సమయంలో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జనసేనకు ఒక సీటు దక్కింది.
ఇదిలా ఉంటే ఈసారి ఫుల్ టైట్ గానే ఎన్నికల యుద్ధం సాగుతోంది. దాంతో ఎవరికి భారీ మెజారిటీలు వస్తాయన్నది కూడా చర్చ మొదలైంది. బడా నాయకులు, బిగ్ స్టార్లు కూడా పెద్ద మెజారిటీలు సాధించగలరా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏపీలో మొత్తం ఉన్న 175 సీట్లలో దాదాపుగా ఎనభై శాతం సీట్లలో ఈసారి మెజారిటీలు పది వేలకు మించి ఉండకపోవచ్చు అన్న అంచనా కూడా కడుతున్నాయి.
ఆ ఇరవై శాతంలోనే పది వేలు దాటే మెజారిటీలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మేము లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని నాయకులు ఎంత గొప్పగా బయటకు చెప్పుకున్నా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం టగ్ ఆఫ్ వార్ అలా సాగుతూనే ఉంది. అంటే చాలా కష్టం మీద ఓట్లు ఒడిసిపట్టే ప్రయత్నం అయితే ప్రతీ రాజకీయ పార్టీ చేస్తున్నాయని అనుకోవాల్సి ఉంది.
ఈ నేపధయం నుంచి చూస్తే ఒక ఆసక్తికరమైన అంశం బయటకు వస్తోంది. ముప్పయి వేలు పైబడి గెలిచే సీట్లు మూడంటే మూడు మాత్రమే ఈసారి ఉంటాయని అంటున్నారు. అవి ఎక్కడ ఏమిటి అన్నది చూస్తే మాత్రం ఒకటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల, రెండవది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, మూడవది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం అని అంటున్నారు.
ఈ మూడు సీట్లు తప్పించి మిగిలీన చోట్ల ఎక్కడా ముప్పయి వేల భారీ మెజారిటీలు ఈసారి నమోదు కాక పోవచ్చు అన్నది ఒక కచ్చితమైన విశ్లేషణగా ఉంది అంతకు మించి భారీ మెజారిటీలు ఈసారి వచ్చేంత సీన్ అయితే లేదు అనే అంటున్నారు. దానికి కారణం ఈసారి ఎన్నికలు చాలా క్లిష్టంగా సంక్లిష్టంగా సాగుతున్నారు. అటూ ఇటూ భారీ మోహరింపు ఉంది. సామ దాన భేద దండోపాయాలు కూడా ప్రయోగిస్తున్నారు.
ఎవరూ తగ్గడం లేదు. ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు. దాంతో ఈసారి భారీ ఆధిక్యతలు ఎవరైనా ఆశించినా అది నిరాశగానే ఉంటుంది అని అంటున్నారు. ఆఖరుకు నారా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా టైట్ ఫైట్ మధ్యనే పోరాడుతున్నారు అన్నది ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు వస్తున్న భోగట్టా. సో భారీ మెజారిటీలు ఈ ఎన్నికల వరకూ మరచిపోవచ్చు అన్నది తల పండిన రాజకీయ పెద్దల మాట.