రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి రహస్య వారసులు?
రష్యా అధ్యక్షుడు పుతిన్ రహస్య సంబంధంపై ప్రముఖ మీడియా సంచలన కథనం వెలువరించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ రహస్య సంబంధంపై ప్రముఖ మీడియా సంచలన కథనం వెలువరించింది. మాజీ ఒలింపిక్ జిమ్నాస్ట్‌తో పుతిన్ ఇద్దరు రహస్య కుమారులను కలిగి ఉన్నారు. వారు ప్రభుత్వ రికార్డులు లేకుండా విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారనేది ఈ వార్త సారాంశం.
రష్యన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వెబ్‌సైట్ ది డోసియర్ సెంటర్ (The Dossier Center) వెల్లడించిన వివరాలు షాకింగ్ గా మారాయి. ఇవాన్ (9) , వ్లాదిమిర్ జూనియర్ (5) బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా పెరుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా ఉన్న పుతిన్ వ్యక్తిగత జీవితం చాలా కాలంగా రహస్యంగానే ఉంది. అయితే తాజాగా అతడి రహస్య సంబంధం బయటకు తెలియడంతో అది సంచలనంగా మారింది. పుతిన్ మాజీ భార్య అతడి నుంచి దూరంగా ఉంటుందని కూడా తెలుస్తోంది.
ది డోసియర్ సెంటర్ వివరాల ప్రకారం... వ్లాదిమిర్ పుతిన్ -మాజీ ఒలింపిక్ రిథమిక్ జిమ్నాస్ట్ అలీనా కబేవాకు ఇద్దరు రహస్య కుమారులు ఉన్నారు. వారు ప్రజల దృష్టి నుండి దూరంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నా వారు ఒంటరిగా ఉన్నారు. వారి ఐడెంటిటీలు కూడా బహర్గతం కాలేదని తెలుస్తోంది.
ఇవాన్ - వ్లాదిమిర్ జూనియర్ మాస్కోకు వాయువ్యంగా ఉన్న వాల్డై సరస్సులో ఉన్న తమ తండ్రి ఇంట్లో భారీ కాపలా నడుమ ఎక్కువ సమయం గడుపుతున్నారని సదరు కథనం పేర్కొంది. చిన్న వయస్సులో ఉన్న పిల్లల కోసం క్రెమ్లిన్ ఫెడరల్ గార్డ్‌కు చెందిన నానీలు(ఆయాలు), ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. అధికారుల పర్యవేక్షణ కూడా ఉంది. వారు ఎక్కువగా ఒంటరిగా లేదా పెద్దలతో గడపాల్సిన పరిస్థితి. వారు తమ తల్లిదండ్రులను అర్థరాత్రి మాత్రమే చూస్తారు! అని కూడా కథనం పేర్కొంది.
ప్రభుత్వ డేటాబేస్‌లో పుతిన్ పిల్లల రికార్డులు లేవు
డోసియర్ సెంటర్ ''పుతిన్ కొడుకు ఇవాన్ ఫోటోలు తమ వద్ద ఉన్నప్పటికీ నైతిక కారణాల వల్ల వాటిని ప్రచురించకూడదని నిర్ణయించుకున్న''ట్లు పేర్కొంది. పుతిన్ కుమారుల వివరాలు ప్రభుత్వ డేటాబేస్‌లలో లేకపోవడం ఆశ్చర్యపరిచింది. మొదటి నుండి వారికి సాధారణంగా గూఢచారులు, ప్రభుత్వ రక్షణ ఉన్న వ్యక్తులే సహకరిస్తున్నారు. వారి పుట్టిన తేదీలు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. వారసులు సాధారణ విమానాలలో ప్రయాణించరు.. వారికి ప్రత్యేక విమానాలు ఉన్నాయి అని కూడా తెలుస్తోంది. వారు కిండర్ గార్టెన్‌లు లేదా పాఠశాలలకు హాజరుకారు.. వారికి అద్దె గవర్నెస్ లు బోధిస్తారు. వారు FSOచే కాపలాగా ఉన్న నివాసాలలో నివసిస్తున్నారు. పడవలలో ప్రయాణిస్తారు. సాయుధ రైళ్లలో వెళుతుంటారు.
తన రహస్య కుమారులతో పుతిన్ బంధం
ఇవాన్ 2015 వసంతకాలంలో స్విట్జర్లాండ్‌లో జన్మించాడని, వ్లాదిమిర్ జూనియర్ 2019 వసంతకాలంలో మాస్కోలో జన్మించాడని కూడా తాజా కథనం వెల్లడించింది. పుతిన్ మాత్రమే వారితో కఠినంగా ఉండగలడని, సోవియట్ కాలం నాటి కార్టూన్లు అయిన పుతిన్ ఇష్టపడే వాటికి భిన్నంగా ఇవాన్ డిస్నీ పాత్రలను చాలా ఇష్టపడతాడని నివేదిక పేర్కొంది.
పుతిన్ తన కుమారుల గురించి బహిరంగంగా మాట్లాడనప్పటికీ అతడు ఇటీవల సైబీరియాలోని పాఠశాల విద్యార్థులతో ''నా కుటుంబంలోని చిన్న సభ్యులు చైనీస్ మాట్లాడతారు'' అని పేర్కొన్నాడు. పిల్లలు స్కీ లెర్నింగ్‌తో పాటు ఇంగ్లీషు, జర్మన్ భాషలను కూడా నేర్చుకుంటున్నట్లు సమాచారం. అలాగే పుతిన్ కొన్నిసార్లు తన వాల్డై ఎస్టేట్‌లోని ప్రైవేట్ రింక్‌లో తన పెద్ద కొడుకుతో కలిసి ఐస్ హాకీ ఎలా ఆడతాడో కూడా ఈ కథనం పేర్కొంది.