రాహుల్‌ మరోసారి.. నోరు జారి..!

లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు.

Update: 2024-09-26 11:23 GMT

లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా మరోసారి నోరు జారారు. జమ్మూకాశ్మీర్‌ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా జమ్మూలో రాహుల్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ నోరు జారారు. వెంటనే తప్పును గ్రహించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

జమ్మూలో జరిగిన సభలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ కాశ్మీరీ పండిట్లను పీవోకే (పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌) నుంచి శరణార్థులని తప్పుగా పేర్కొన్నారు. కాశ్మీరీ పండిట్లకు గతంలో కాంగ్రెస్‌ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అనేక హామీలు ఇచ్చారని రాహుల్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ హామీలను నెరవేరుస్తామని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌ లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో కాశ్మీరీ పండిట్ల గురించి మాట్లాడుతూ వారిని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ నుంచి వచ్చిన శరణార్థులని రాహుల్‌ గాంధీ పొరపాటున మాట్లాడారు. అంతలోనే తన తప్పును గ్రహించిన ఆయన దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించారు. క్షమించండి.. కాశ్మీరీ పండిట్లకు మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆర్థిక ప్యాకేజీలకు సంబంధించి 2014లో పీఓకే నుంచి వచ్చిన శరణార్థులకు చేసిన వాగ్దానాలు కూడా నెరవేరుస్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నేత శామ్‌ పిట్రోడా ఇలాగే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదని బీజేపీ మండిపడింది.

ఈ మేరకు బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాల్వియా.. రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి శరణార్థులు ఎవరో, కాశ్మీరీ పండిట్లు ఎవరో తెలియదని.. వారికి, వీరికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. రాహుల్‌ ఇక పప్పు కాదని ఇటీవల శ్యామ్‌ పిట్రోడా వ్యాఖ్యానించారు.. కానీ రాహుల్‌ తన వ్యాఖ్యల ద్వారా తాను పప్పునేనని నిరూపించుకుంటూనే ఉన్నాడన్నారు.

కాశ్మీర్‌ ఇంత గందరగోళంగా మారడానికి కారణమైన జవహర్‌ లాల్‌ నెహ్రూ వారసత్వాన్ని రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్నారని అమిత్‌ మాల్వియా ధ్వజమెత్తారు.

సోషల్‌ మీడియాలోనూ రాహుల్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు కామెంట్లు చేశారు. రాహుల్‌ గాంధీ ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే బీజేపీకి అంత లాభం జరుగుతుందని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించారు. భారీ సెల్ఫ్‌ గోల్స్‌ వేసుకోవడంలో రాహుల్‌ తర్వాతే ఎవరైనా అని మరొక నెటిజన్‌ పోస్టు చేశాడు.

Tags:    

Similar News