విశాఖ తొలి ఎంపీ వారసులు కడు దైన్యంగా !
అలాంటికి పార్లమెంట్ సభ్యుడుగా పనిచేసినా ఆయన వారసులు మాత్రం కడు దైన్యంగా బతుకుతున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఎక్కడ అంటే విశాఖలోనే.
ఒక వార్డుకు మెంబర్ గా చేసినా రాజ ఠీవి వచ్చేస్తుంది. అంతే కాదు రెండు మూడు తరాలకు సరిపడా సంపద వచ్చేస్తుంది. అలాంటికి పార్లమెంట్ సభ్యుడుగా పనిచేసినా ఆయన వారసులు మాత్రం కడు దైన్యంగా బతుకుతున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఎక్కడ అంటే విశాఖలోనే.
విశాఖ లోక్ సభకు మొదటి ఎంపీగా విశాఖ ఏజెన్సీకి చెందిన మల్లుదొర పనిచేశారు. ఆయన కొయ్యూరు మండలంలోని బట్టిపనుకుల గ్రామం లంక వీధిలో జన్మించర్. ఆయన 1952 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచి మొదటిసారి ఎంపీ అయ్యారు. ఆయన ఎవరో కాదు గంటం దొర సోదరుడు. అలా గంటం దొర మల్లుదొర అల్లూరి సీతారామరాజు తో కలసి బ్రిటిష్ వారిని ఎదిరించారు. వీరోచిత పోరాటాలు చేశారు
అంతటి ఘనమైన కుటుంబానికి చెందిన వారసులు ఆకలిదప్పులతో ఉన్నారు అంటే నిజంగా బాధాకరం అనే చెప్పాలి. మల్లుదొర 1890లో బొగ్గుదొరకు జన్మించారు. మల్లు దొర గంటం దొర అల్లూరికి విప్లవ పోరాటాలలో ఎంతగా సాయపడ్డారో చరిత్ర చెబుతుంది.
బ్రిటిష్ వారిని గట్టిగా ఎదుర్కొన్న అల్లూరికి ఆయుధాలు అందించడంతో వీరు చాలా ఉపయోగపడ్డారు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన ఘటనలోనూ అల్లూరితోనే వీరు పోరాటాలలో పాలు పంచుకున్నారు. అలా 1921 నుంచి 1923 మధ్యలో సాగిన అల్లూరి పోరాటాలలో మల్లు దొర గంటం దొరల పాత్రలు చాలా ప్రధానంగా ఉన్నాయి.
ఇక గంటం దొర 1922 ప్రాంతంలో మన్యంలో మునసబుగా పనిచేస్తూ ఉండేవారు. ఆయనని చింతపల్లి సెబాస్టియన్ ఆ పదవి నుంచి తొలగించారు. అంతే కాదు ఆయన భూమితో పాటు గిరిజనుల భూములను కూడా తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి వాటిని దాఖలు చేశారు.
అలా ఈ ఘటన మన్యంలో అతి పెద్ద విప్లవానికి కారణం అయింది అని చరిత్రకారులు చెబుతారు. మల్లు దొర గంటం దొర ఆ మీదట అల్లూరి సాయం తీసుకున్నారు. అలా మన్యంలో గిరిజన పోరాటాలు పెద్ద ఎత్తున సాగాయి. అంతే కాదు ఆనాడు తెల్ల దొరలను ఎదిరించడానికి ఏకంగా 150 మందికి పైగా గిరిజనులకు మల్లు దొర గంటం దొరలు కలసి శిక్షణను ఇచ్చారు.
ఇక విశాఖ ఏజెన్సీలో విప్లవం రాజుకుంది. అలా 1922 ఆగస్ట్ నుంచి 1923 ఏప్రిల్ మధ్య కాలంలో వరుసగా చింతపల్లి, కేడీ పేట, రాజవొమ్మంగి, మాడుగుల, అడ్డతీగల, రంప చోడవరం, అన్నవరం పోలీస్ స్టేషన్లపై అల్లూరి సాయంతో మల్లు దొర గంటం దొర దాడి చేసి అక్కడి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇక బ్రిటిష్ వారు వీరి కోసం పెద్ద ఎత్తున వేట సాగించారు. వీరిని పట్టిస్తే నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించారు. అయితే వారి నుంచి తప్పించుకుంటూ మల్లుదొర 1923 సెప్టెంబర్ 17న నడింపాలెం చేరుకుని కొంత కాలం అక్కడే ఉన్నట్లుగా చరిత్ర చెబుతోంది. ఆ తరువాత మాత్రం మల్లుదొర బ్రిటిష్ వారికి దొరికిపోయారు.
అయితే మల్లు దొర గుండె నిబ్బరం ఎంతటి గొప్పది అంటే ఆయనను అల్లూరి ఆచూకీ కోసం బ్రిటిష్ వారు నానా రకాలైన నరకం చూపించినా ఒక్క ఆచూకీ కూడా బయటపెట్టలేదు. అయితే అనూహ్యంగా అల్లూరి అచూకీ 1924 మే నెలలో బ్రిటిష్ వారికి చిక్కడంతో ఆయనను మే 7న చంపేశారు. అది జరిగిన మరి కొన్ని రోజులకే గంటం దొర కూడా బ్రిటిష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారని చరిత్ర చెబుతోంది.
ఇక మల్లుదొర బ్రిటిష్ వారికి చిక్కడంతో ఆయనకు మరణశిక్ష విధిస్తూ 1924 అక్టోబర్ 28న తీర్పు వచ్చింది. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చి అండమాన్ జైలుకు తరలించారు. ఆ విధంగా ఆయన ఏకంగా 13 ఏళ్లు జైలు జీవితం అనుభవించి క్షమాభిక్షపై జైలు నుంచి 1937లో విడుదలయ్యారు. అప్పటికి కూడా బ్రిటిష్ పాలన ఉంది. దాంతో ఆయన మళ్లీ మన్యంలో గిరిజన నాయకుడిగానే వ్యవహరించారు.
ఆ మీదట 1947లో దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. దాంతో 1952లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. అలా అప్పట్లో విశాఖ నుంచి లంక సుందరం తో పాటు మల్లుదొర కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఎంపీలు కావడం ఆ రోజుల్లో ఉండేది. అప్పట్లో దేశంలో ఇటు పార్లమెంట్ అటు అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాలకు ఇద్దరేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇలా ఇద్దరు ఉన్న నియోజకవర్గాలను ద్విసభ్య నియోజకవర్గాలు అనేవారని చరిత్ర చెబుతోంది.
అలా లంక సుందరం పట్టణ ప్రాంతానికి మల్లు దొర మన్యం నుంచి ఎంపీలుగా నెగ్గారు. లంక సుందరం విషయానికి వస్తే ఆయన పేరు గడించిన న్యాయవాది. ఆయనతో కలసి మల్లు దొర పార్లమెంట్ లో సభ్యుడిగా పనిచేశారు.
ఇక మల్లు దొర తాను పుట్టిన కొయ్యూరు మండలం బట్టిపనుకుల గ్రామంలోని లంకవీధిలో ఒక మిద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. అయితే అది ఇపుడు ఏ మాత్రం ఆనవాళ్ళే లేకుండా మట్టి దిబ్బగా మారింది. ఆ ఇల్లు గొప్పదనం ఏమిటి అంటే అక్కడే ఆ ఇంటిలోనే అల్లూరి, గంటందొర, మల్లు దొర ఇతర ముఖ్య నాయకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కీలకమైన విప్లవ సమావేశాలు నిర్వహించేవారు.
ఇదిలా ఉంటే మల్లు దొర వారసులు ఎలా ఉంటున్నారు అనేది చూస్తే కనుక సన్యాసమ్మ ముని మనమరాలుగా ఉన్నారు. మల్లు దొర ఒకసారి కేవలం మూడేళ్ళు మాత్రమే ఎంపీ అయ్యారు. ఆయన ఆ సమయానికే ఎంతో పేదరికం అనుభవించారు. అయినా ప్రభుత్వాల నుంచి ఏ సాయం కోరుకోలేదని ముని మనవరాలు సన్యాసమ్మ చెప్పారు.
అలా ఆయన తినడానికి తిండి లేక, ఇల్లు లేక అష్టకష్టాలు పడుతుండేవారని చెప్పారు. ఉన్న ఇల్లు శిధిలం అయ్యింది. ప్రభుత్వం ఇల్లు కట్టి ఇస్తామన్నా దానికి ఆశపడలేదు. మట్టితో నిర్మించుకున్న చిన్న మిద్దె ఇంట్లోనే మల్లు దొర చివరి దాకా గడిపి 1969లో చనిపోయారని సన్యాసమ్మ తెలిపారు.
ఇక మా ముత్తాత విశాఖ తొలి ఎంపీ అని చెప్పుకుంటున్నా మాకు ఏమీ లేదని మల్లుదొర మని మునవడు రాజబాబు చెప్పారు. కనీసం తినడానికి కూడా తిండి లేదని పనస పళ్లు పండించుకోవడమే మాకు జీవనాధారం అని ఆయన చెప్పారు. అంతే కాదు మాకు కావాల్సిన మాకు కావలసినవి మేం పండించుకుని తినడమే మా జీవితం అని ఆయన పేర్కొన్నారు తమకు మాకు వేరే ఆధారం లేదు. కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదని రాజబాబు చెబుతున్నారు.
అయితే ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లామని అయినా స్పందన లేదని అన్నారు. అయితే కొందరు ప్రైవేటు వ్యక్తులు, క్షత్రియ సంఘాలకు చెందిన వారు గంటందొర, మల్లుదొర వారసులుగా ఉన్న మా కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నారని రాజుబాబు చెప్పారు. ఏది ఏమైనా ఎంపీగా పనిచేసిన వారి వారసులు ఈ విధంగా దైన్యంగా ఉండడం మాత్రం బాధాకరం. వారిని ఆదుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత.