లోక్ సభ ఎన్నికలకు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే మిస్సింగ్?
టార్గెట్ 370 అంటూ పరుగులు పెడుతున్న బీజేపీ.. లోక్ సభ అభ్యర్థులను ఆచితూచి ఎంపికచేస్తోంది.
టార్గెట్ 370 అంటూ పరుగులు పెడుతున్న బీజేపీ.. లోక్ సభ అభ్యర్థులను ఆచితూచి ఎంపికచేస్తోంది. నోరుజారిన, క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టికెట్లు కట్ చేస్తోంది. ఎలాగైనా సరే తమ టార్గెట్ ను చేరుకునేందుకు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ చేస్తోంది. ఇందులో భాగంగానే ఏపీలో టీడీపీ వంటి ఎప్పుడో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన మిత్ర పక్షాలనూ కలుపుకొంటోంది. ఆప్ వంటి పార్టీలను బలహీనం చేస్తోంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే కీలక నేతలను రంగంలోకి దించి ప్రచారానికి వాడుకుంటోంది.
మరి ఆయన ఎక్కడ?
తెలంగాణ ఉద్యమానికి మొదటినుంచి మద్దతు పలికిన బీజేపీకి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రెండు సీట్లలో గెలిచింది. 2018లో అయితే ఒక్క స్థానానికే పరిమితం అయింది. ఈ ఒక్కరు కూడా గోషా మహల్ నుంచి రాజాసింగ్. ఈయనే శాసన సభా పక్ష నేతగా వ్యవహరించారు. ఇక 2003 ఎన్నికల్లోనూ రాజాసింగ్ నెగ్గి హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం ఉన్న 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో సీనియర్ ఈయనే.
శాసనసభా పక్ష నేత పదవి దక్కలే
మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు బీజేపీ శాసనసభా పక్ష నేత పదవి ఆశించారు రాజాసింగ్. కానీ, వేరే వారికి ఇవ్వడం కినుక వహించారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు వంటి కీలక సమయంలో ఆయన అసలు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. గత శనివారం బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో అన్ని స్థాయిల నాయకులు పాల్గొన్నారు. కానీ, రాజాసింగ్ మాత్రం అందులో లేరు.
రాజాసింగ్ తిరుగుబాటు
బీజేపీ గతంలో ఓసారి రాజాసింగ్ ను బహిష్కరించింది. అయితే, ఇప్పుడు ఆయనే బీజేపీని బహిష్కరించారనే వాదన వస్తోంది. ఆయన రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు చేశారని కూడా చెబుతున్నారు. కరుడుగట్టిన హిందూత్వ వాది అయినా రాజాసింగ్ ను ఎలా సముదాయించాలో కూడా తెలియని పరిస్థితిలో బీజేపీ నాయకత్వం ఉండడం గమనార్హం.
హైదరాబాద్, జహీరాబాద్ లో ప్రచారానికి దూరం
రాజాసింగ్ ను హైదరాబాద్, జహీరాబాద్ లోక్ సభ స్థానాల్లో ప్రచారానికి దింపాలని బీజేపీ యోచించింది. హైదరాబాబాద్ లో మాధవీ లతకు, జహీరాబాద్ లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన బీబీ పాటిల్ కు టికెట్ ఇచ్చారు. దీంతో నగరంలో హిందూ ఓటర్లను, జహీరాబాద్ లో కర్ణాటక, మహారాష్ట్ర ఓటర్లను రాజాసింగ్ ద్వారా ఆకట్టుకోవాలని చూసింది కాషాయ పార్టీ. కానీ, ఈయన అసలు అంతూపంతు లేకుండాపోయారు. వాస్తవానికి ఈ రెండు సీట్లలో ఒకదానిని ఆయన ఆశించారని చెబుతున్నారు. అయితే, హైదరాబాద్ టికెట్ ను మాధవీలతకు ఇవ్వడంతో ‘‘హైదరాబాద్ లో పోటీకి మొగాడే దొరకలేదా?’’ అంటూ కటువుగా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి ప్రకటనలూ లేకపోవడం గమనార్హం.