రతన్ టాటా గ్యారేజ్... ఈ రెండు కార్ల ప్రత్యేకత తెలుసా?

భారతదేశం గర్వించదగ్గ దిగ్గజ వ్యాపార వేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా 86వ ఏట అక్టోబర్ 9న రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు

Update: 2024-10-10 22:30 GMT

భారతదేశం గర్వించదగ్గ దిగ్గజ వ్యాపార వేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా 86వ ఏట అక్టోబర్ 9న రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. దీంతో... ఆయనతో ఉన్న జ్ఞాపకాలను, ఆయన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు దేశ ప్రజలు. ఈ సమయంలో ఆయన ఇష్టాఇష్టాలపైనా చర్చ జరుగుతుంది.

అవును... కంట్రీ ఫస్ట్ ప్రాఫిట్ నెక్స్ట్ అంటూ బ్రతికిన వ్యాపారవేత్త, తనకున్నదానిలో ఓపిక ఉన్నంత వరకూ ప్రపంచానికి పంచాలని నమ్మిన సిద్ధాంత కర్త.. రతన్ టాటా జ్ఞాపకాలు, ఇష్టాలపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన గ్యారేజ్ లో ఉన్న వాటిలో ఆయన హృదయానికి దగ్గరైనవి, ఆయన సగర్వంగా ప్రకటించుకున్న రెండు కార్లు ఉన్నాయి. అవి ఏమిటనేది ఇప్పుడు చూద్దాం..!

నివేదికల ప్రకారం... రతన్ టాటా కార్ల కలెక్షన్స్ లో చాలా విలాసవంతమైన కార్లు ఉన్నాయని అంటారు. వాటిలో సరదాపడినవి, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దామనుకున్నవి, మరికొన్ని సెక్యూరిటీ కోసం, ఇంకొన్ని మరికొన్ని కారణాల కోసం ఉన్నట్లు చెబుతారు. అయితే వాటిలో ప్రత్యేకంగా రెండు కార్లను ఆయన బాగా ఇష్టపడతారంట. అవి ఆయన హృదయానికి దగ్గరగా ఉన్న కార్లు.

వాటిలో ఒకటి.. లక్ష రూపాయల ధరతో విడుదల చేసిన టాటా నానో కాగా... మరొకటి ఆయన సగర్వంగా ప్రకటించుకున్న టాటా ఇండికా. ఈ సందర్భంగా టాటా ఇండికా ఆయనకు ఎందుకు అంత దగ్గరైందో.. నానో ఆలోచన ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం...!

"మేము మారుతీ జెన్ పరిమాణంలో.. అంబాసిడర్ అంత ఇంటర్నల్ స్పేస్ తో.. మారుతీ 800 ధరతో.. డీజిల్ ఎకనామిక్ రేటుతో నడిచే కారును తయారు చేస్తాం" అని రతన్ టాటా ప్రకటించారు. సహజంగానే ఇది జరిగే పని కాదు అని చాలా మంది అభిప్రాయపడ్డారు. మరికొంతమందితే నవ్వుకుని కూడా ఉంటారు. ఆ ఆలోచనతో 1995లో రతన్ టాటా ఈ మిషన్ ప్రారంభించారు.

దీనికోసం రతన్ టాటా తన కంపెనీకి చెందిన పూణేలోని ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఇంజినీర్లకు ఆ పనిని అప్పగించారు. అయితే... అంతకు మునుపెన్నడూ కారు తయారు చేయని కంపెనీ అది. ఆ సమయంలో కొత్త ఫ్లాంట్ కోసం 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం.. అయితే అంత పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు!

ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సెర్చ్ చేసిన రతన్ జీకి.. ఆస్ట్రేలియాలో మూసి ఉన్న నిస్సాన్ ఫ్లాంట్ కనిపించింది. మరో ఆలోచన లేకుండా దాన్ని విప్పి సముద్ర మార్గంలో జాగ్రత్తగా పూణేకు తీసుకొచ్చారు. ఫ్లాంట్ మొత్తాన్ని తిరిగి ఇక్కడ అమర్చారు. ఇది ఆరు నెలల్లోనే పూర్తయ్యింది. దానికి అయిన ఖర్చు.. కొత్త ఫ్లాంట్ ఏర్పాటుకు అనుకున్న ఖర్చులో 20 శాతం మాత్రమే కావడం గమనార్హం!

ఫ్లాంట్ లో పని మొదలైంది. కట్ చేస్తే... 1998లో దేశంలో తన మొట్టమొదటి చిన్న కారు టాటా ఇండికాను విడుదల చేశారు రతన్ టాటా! ఈ వాహనం అమ్మకాలు ప్రారంభించిన రెండేళ్లలోనే సుమారు 1.25 లక్షల ఆర్డర్లు దక్కించుకుంది. ఈ సమయంలో... ఇండికాను యూకే కి కూడా రవాణా చేశారు. ఈ విధంగా... నానో, ఇండికాలు ఆయన మనసుకు దగ్గరైన కార్లగా నిలిచిపోయాయి!

Tags:    

Similar News