కేసీఆర్ పై రేవంత్ పోటీ.. లాజిక్కు ఇదేనా?
సీఎం కేసీఆర్ కు షాకిచ్చేందుకు వీలుగా రేవంత్ రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ ఓకే అన్నట్లుగా వస్తున్న వార్తలు అందరిని ఆకర్షిస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఎదురుకాని సీన్లు.. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎదురు కానుందా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. ఎవరెన్ని చెప్పినా.. ముఖ్యమంత్రి మీద పోటీ చేసేందుకు పేరున్న నాయకులు పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించరు. అందుకు భిన్నమైన సీన్ తెలంగాణలో చోటు చేసుకోంటోంది. కాంగ్రెస్ కు మంచి పట్టున్న కామారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు అందరి చూపు పేడలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఆయనపై పోటీకి బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేందర్ బరిలోకి దిగటం తెలిసిందే. తాజాగా.. ఈ స్థానం నుంచి టీపీసీసీ చీఫ్ కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ కు షాకిచ్చేందుకు వీలుగా రేవంత్ రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ ఓకే అన్నట్లుగా వస్తున్న వార్తలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ తీరు చూస్తే.. ఆయన గులాబీ బిగ్ బాస్ ను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ మాదిరే రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆయన.. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ తో పాటు.. కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డి వైపు ఫోకస్ చేయటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
సీఎంపై ముఖ్యమంత్రి కుర్చీని ఆశిస్తున్న రేవంత్ పోటీ చేయటంతో.. ఈ ఎన్నికల్లో హైలెట్ ఎన్నికగా కామారెడ్డి మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ స్థానం నుంచి పోటీకి సిద్ధమైన షబ్బీర్ అలీని.. నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దించుతున్నారు. ఇంతకీ రేవంత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీకి ఎందుకు నిలిపినట్లు? కాంగ్రెస్ ఇంతటి రిస్కు ఎందుకు తీసుకున్నట్లు? రేవంత్ సైతం ఈ విషమ పరీక్షకు ఓకే ఎందుకు చెప్పినట్లు? అన్నది ప్రశ్నగా మారింది.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తనకు అంతగా పట్టు లేని కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీకి ఓకే చెప్పటం ద్వారా ఆయనకు గెలుపు భయాన్ని కలిగించేందుకు దక్కిన అవకాశంగా భావిస్తున్నారు. గ్రౌండ్ రిపోర్టులు చూస్తే.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు గట్టి పోటీ ఎదురు కానుంది. గుర్రం ఎగరావచ్చు అన్న రీతిలో పరిస్థితులు ఏర్పడతాయని.. తాము అంచనా వేసినట్లుగా సీఎంకు షాకిచ్చే పరిణామాలు ఏర్పడిన పక్షంలో.. ఇంతకు మించిన ఇబ్బందికర పరిస్థితులు ఏం ఉంటాయన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. రేవంత్ ను బరిలోకి దించటం ద్వారా కేసీఆర్ కు తాను పోటీకి దిగిన కామారెడ్డి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ నెల తొమ్మిదిన కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రేవంత్ అంతకు ముందే నామినేషన్ వేసేందుకు రెఢీ కావటం ఆసక్తికరంగా మారింది.