రైతుభరోసాపై రేవంత్ తాజా ప్లానింగ్.. హోల్ సేల్ షాక్ తప్పదట!

పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ఈ మొత్తం ఏడాదికి రెండుసార్లు అందుతుందన్న సంగతి అందరికి తెలిసిందే.

Update: 2024-02-25 04:32 GMT

ప్రభుత్వం మారినంతనే ప్లాగ్ షాప్ పథకాల పేర్లు మారిపోవటం తెలిసిందే. కేసీఆర్ అధికారంలో ఉన్న వేళ షురూ చేసిన రైతుబంధు పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ఈ మొత్తం ఏడాదికి రెండుసార్లు అందుతుందన్న సంగతి అందరికి తెలిసిందే. బడ్జెట్ లో దీనికి భారీగా నిధులు కేటాయిస్తున్న వేళ.. రైతుబంధు విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత ఆలోచనలు వేరుగా ఉన్నట్లు చెబుతున్నారు.

తాను సీఎం అయిన వెంటనే రైతుబంధు పథకాన్ని రైతుభరోసాగా మార్చేయటం తెలిసిందే. అంతేకాదు.. ఈ పథకంలో లబ్థిదారులుగా అందరిని చేర్చటాన్ని రేవంత్ మొదట్నించి తప్పు పడుతున్నారు. తాజాగా ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయి. పెట్టుబడి సాయాన్ని బక్కచిక్కిన రైతులకు ఇవ్వాలే కానీ.. భారీగా భూ బ్యాంక్ ఉన్న వారికి ఎందుకు ఇవ్వాలన్నది ప్రశ్నగా మారింది.

ఈ క్రమంలో ఐటీ కట్టే వారు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలు.. ఇలా కొందరికి రైతుభరోసాను ఇవ్వకూడదన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించి అంశాలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు కొనసాగిన రీతిలో కాకుండా రైతుభరోసాకు కొత్త రూపం ఇస్తారని చెబుతున్నారు.

ఈ సాయాన్ని ఐదు ఎకరాలు కానీ పది ఎకరాలు మాత్రం ఉన్న వారికి ఇస్తారు. అంతకు మించి భూమి ఉన్న వారికి మాత్రం ఎలాంటి సాయాన్ని అందించకూడదన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. రైతుబంధులో ఎంతోమంది అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని.. దీనికి కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నది సీఎం రేవంత్ ఆలోచన. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సాయంతో ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు.. బీడు భూముల్ని గుర్తించి.. వాటి ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విదిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రైతుభరోసాకు ఎలాంటి మార్గదర్శకాలు విధించాలన్న దానిపై ఇప్పటికే రిపోర్టు వచ్చిందంటున్నారు. అయితే.. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాలతో రైతుభరోసాను అమల్లోకి తీసుకొస్తారని చెబుతారు. అయితే.. మరి వ్యతిరేకత రాదా? అంటే ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచన వేరుగా ఉంది. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి సాయంగా ప్రభుత్వం నుంచి పోవాలే తప్పించి.. వేలాది కోట్లు భూమి ఉందన్న కారణంగా అవసరం లేని వారికి సైతం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరంఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన రైతుబంధును ఏడాదికి రెండు దఫాల్లో మొత్తం రూ.8వేలు ఎకరానికి ఇవ్వటం తెలిసిందే. దాన్ని తర్వాతి కాలంలో రూ.10వేలకు పెంచారు. రెండు సీజన్లకు కలిసి 1.52 లక్షల ఎకరాలకు సంబంధించిన 68.99 లక్షల మంది రైతులకు ఏటా రూ.15,280 కోట్ల భారీ మొత్తాన్ని అందచేస్తున్నారు.రేవంత్ సర్కారు ఆలోచన ఏమంటే.. ఇప్పటివరకు ఇస్తున్న రూ.10వేలకు బదులుగా రూ.15వేల మొత్తాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న రేవంత్.. తాజా మార్గదర్శకాలతో భారీ భూబ్యాంక్ ఉన్న వారికి హ్యాండ్ ఇవ్వనున్నారు.

తాజా మార్గదర్శకాలతో రైతుభరోసాను అమల్లోకి తీసుకొస్తే ప్రభుత్వానికి దాదాపు రూ.7800 కోట్ల వరకు ఆదా చేయొచ్చని చెబుతున్నారు. ఇక.. ఇప్పటికే ఉన్న లబ్థిదారుల్లో 90 శాతం మందికి ఎకరానికి రూ. 15 చొప్పున (అంటే ప్రతి ఆర్నెల్లకు ఒకసారి రూ.7500 చొప్పున) పంట సాయాన్ని అందిస్తారు. ఒకవేళ.. ఐదు ఎకరాల్ని సీలింగ్ గా పెడితే మరింత భారీగా నిధులు మిగిలే వీలుంది. అదే పది ఎకరాల వరకు పరిమితి విధిస్తే కొంత మేర తగ్గినా.. ప్రభుత్వానికి మాత్రం ఖర్చు విషయంలో ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News